నాగిరెడ్డిపేట, మే 16: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా కాంటా చేయడంలేదని, కాంటా చేసినా లారీలు రాక ధాన్యం తరలించడంలేదని ఆగ్రహించిన మండలంలోని మాల్తుమ్మెద గ్రామ రైతులు రోడ్డెక్కారు. శనివారం గ్రామంలోని జాతీయరహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ‘అధికారులు రావాలి మా ధాన్యం వెంటనే తూకం వేయించి, కొనుగోలు కేంద్రం నుంచి తరలించాలి’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కాలయాలపన చేస్తున్నదని మండిపడ్డారు. ధాన్యం ఎండకు ఎండిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు క్వింటాలుకు 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. గతంలో లారీ డ్రైవర్లకు బస్తాకు రూపాయి ఇచ్చామని, ఈసారి రెండు నుంచి మూడు రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు. ప్రతిచోటా రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
కేవలం 50మంది రైతుల ధాన్యం కొనుగోలు
మాల్తుమ్మెద పరిధిలోని రెండు కొనుగోలు కేంద్రాల్లో 150 లారీల ధాన్యం ఉన్నదని, 20 రోజుల నుంచి ఇప్పటివరకు 20 లారీలు మాత్రమే వచ్చాయని సర్పంచ్ పుప్పాల సాయిలు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా నెల రోజులైనా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాదన్నారు. కొనుగోలు కేంద్రాలకు మొత్తం 350 మంది రైతులు ధాన్యం తీసుకురాగా, ఇప్పటివరకు కేవలం 50 మందికి చెందిన వడ్లను మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న గిర్దావర్ మహేశ్‌చందర్,ఎల్లారెడ్డి సీఐ రాజరెడ్డి , ఏఎంసీ చైర్మన్ నర్పింహులు చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.
ఎల్లారెడ్డి, మే 16: ధాన్యం తరలించడానికి కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదంటూ లింగంపేట మండలంలోని ఐదు గ్రామాల రైతులు ఎల్లారెడ్డి మండలంలోని కొట్టాల్ క్రాసింగ్ వద్ద శనివారం ధర్నా చేశారు. ఎల్లారెడ్డి- కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. లింగంపేట మండలంలోని భవానీపేట, జల్దిపల్లి, రాంపూర్, ముంబోజిపేట, కొండాపూర్ గ్రామాలకు లారీలు రావ డం లేదని వాపోయారు. మరో పది రోజులైతే వర్షాలు కురుస్తాయని, కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్ కొట్టాల్ క్రాసింగ్‌కు చేరుకున్నారు. ధర్నాలో పాల్గొన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే ఆయన పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీకాంత్‌తో ఫోన్లో మాట్లాడారు. ఐదు గ్రామాలకు అవసరమైన లారీలను వెంటనే పంపాలని కోరగా, డీఎం సానుకూలంగా స్పందించడంతో రైతులు ఆందోళన విరమించారు.

Nizanabad3
15రోజులవుతున్నా కాంటా చేయడంలేదు..
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కాంటా చేయలేదు. ప్రస్తుతం మండుతున్న ఎండలకు ధాన్యం ఉన్న చోటే మాడిపోతున్నది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.
-బోయిని సాయిలు, రైతు, మాల్తుమ్మెద
ధాన్యం తీసుకవచ్చి 25 రోజులైంది..
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 25 రోజులైంది. లారీలు రాకపోవడంతో తూకం వేయడం లేదు. వెంటనే లారీలు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-గుడాల నారాయణ, రైతు, మాల్తుమ్మెద
త్వరగా ధాన్యం తరలించాలి..
ధాన్యం తూకం వేసి 5 రోజులైంది. కానీ లారీలు రాకపోవడంతో తూకం వేసిన చోటే తరుగుపోతున్నది. లారీల కొరత నివారించి త్వరగా ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలి
-కర్రె సంతోష్, రైతు, మాల్తుమ్మెద