నిజామాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏ వర్గాన్నీ సంతృప్తి పరచడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలుచేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతున్నది. పథకాల అమలుపై అస్పష్టత అందరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ భారీ ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సర్కారు తీరా ఇప్పుడు పథకం అమలుపై పూటకో మాట చెబుతున్నది. రెండు పర్యాయాలు గడువు తేదీని పొడిగించి రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులను స్వీకరించింది.
మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన ఎటూ తేలడం లేదు. అర్హత, విధివిధానాల విషయంలో అస్పష్టత ఎదురవుతుండడంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక సర్కారు పెద్దలంతా తలలు ప ట్టుకుంటున్నారు. యు వతకు యూనిట్లు మంజూ రు చేసేందుకు సర్కారు తాజా గా వెనుకడుగు వేసింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఘనంగా ప్రారంభించాలని మొదట్లో సన్నాహాలు చేశారు. తీరా ఏమైందో కాని పథకం ఊసే కరువైంది. ఎప్పుడు ఈ పథకానికి మొక్షం లభిస్తుందో అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 35 వేల 732 యూనిట్లు అందుబాటులో ఉంటే లక్షా మూడు వేల 558 మంది దరఖాస్తులు సమర్పించారు. రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు రుణాల కోసం జూన్ 2 నుంచి తొమ్మిదో తేదీ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని గతంలోనే సర్కారు ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల రుణాలను జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మంజూరు చేయాలని నిర్ణయించింది. మే 29న ఎడిట్ ఆప్షన్ ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎక్కువ రుణమున్న వారంతా చాలా మంది రూ.లక్షలోపు రుణానికి కుదించుకున్నారు.
పైగా సిబిల్ స్కోర్ కింద బ్యాంకర్లు పక్కన పెట్టిన వారికి రూ. 50 వేల రుణానికి అవకాశం ఇవ్వడంతో వారంతా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి చిన్నపాటి రుణ సాయానికి దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున పిలుపు వస్తుందని చాలా మంది ఆశ పడ్డారు. సీన్ కట్ చేస్తే ఆశావహుల నీళ్లపై సర్కారు నీళ్లు చల్లింది. దరఖాస్తులను లోతుగా పరిశీలించిన అనంతరం ఆర్థిక సాయం అందివ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లాభం జరుగుతుందని ఆశ పడిన వారంతా బాధపడుతున్నారు. నమ్మించి ముంచుతున్నదని ప్రభుత్వ తీరుపై దరఖాస్తుదారులు మండిపడుతున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని కొంత మందికే అందివ్వాలనే ఉద్దేశంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సాగదీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. దరఖాస్తుదారుల్లో కొందరిని ప్రాథమిక దశలోనే తొలగించి.. మిగిలిన వారికి అరకొరగా సాయం అందించాలని యోచిస్తున్నట్లు స మాచారం. దరఖాస్తుదారులంతా తమకు ఎప్పుడు యూనిట్లు మంజూరు అవుతాయని ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమాధానం చెప్పలేక వారంతా మిన్నకుండి పోతున్నారు.
పది రోజులపాటు అర్హుల జాబితా రూపకల్పన విషయంలో అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. జూన్ 2న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన కొంత మందికి రుణ మంజూరు పత్రాలు అందివ్వాలని యోచించారు. తీరా ప్రభుత్వ ఆదేశాలతో వెనక్కి తగ్గారు. రుణాల కోసం ఎదురుచూసిన యువత ఒక్కసారిగా డీలా పడింది. నిజామాబాద్ జిల్లాకు మొత్తం 22,285యూనిట్లు కేటాయించారు. కాగా దరఖాస్తులు మాత్రం 58,896 వచ్చాయి. కామారెడ్డి జిల్లాకు 13,447 యూనిట్లు కేటాయించగా మొత్తం 44,662 దరఖాస్తులు వచ్చాయి.