నిజామాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ ఏండ్ల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేశాడు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలని ఆలోచించినా ఆర్థిక స్థోమత లేక.. అప్పులు చేసే ధైర్యం చాలక ఊరుకున్నాడు. సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టడం.. వెంటనే దరఖాస్తు చేసుకోవడంతో రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ప్రస్తుతం సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పని చేసుకుంటున్నాడు. ఇది ఒక ప్రసాద్ విషయమే కాదు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేలాది మంది కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపింది. దళితుల బాగుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. దళితుల్లో ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నది. రాష్ట్రంలోని దళితులందరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని అమలు చేయాలన్నది సీఎం సంకల్పం. మొదటి విడుతలో దళితబంధు అందుకున్న లబ్ధిదారులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడుత ప్రారంభానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నియోజకవర్గానికి 1,100 కుటుంబాలను ఎంపిక చేయాలని నిర్ణయించగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9,900 మందికి లబ్ధి చేకూరనున్నది.
-నిజాంసాగర్/ఖలీల్‌వాడి, మార్చి 12
నిజాంసాగర్/ ఖలీల్‌వాడి, మార్చి 12: దళితులకు నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని నిరూపించే పథకాల్లో విశిష్టమైన, విశేషమైన పథకం దళితబంధు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న పథకం. అంబేద్కర్ తర్వాత సీఎం కేసీఆర్ మాత్రమే దేశంలో దళితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనడానికి దళితబంధు నిదర్శనం. దళితుల స్వావలంబన, సమగ్ర అభ్యున్నతి లక్ష్యంగా దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. దళితుల సంక్షేమంలో దళితబంధు అమలు ఒక సువర్ణ అధ్యాయంగా పేర్కొనవచ్చు. దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి సరికొత్త బాటలు వేసే దళితబంధును లబ్ధిదారులు పూర్తిగా సద్వినియోగపర్చుకున్నప్పుడే ప్రభుత్వ ఆశయానికి సార్థకత చేకూరుతుంది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన దళితబంధు ఫలితాలు రాష్ట్రంలో అప్పుడే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం దళితబంధు కింద ఇచ్చిన రూ.10లక్షలకు తమ నైపుణ్యాన్ని జోడు చేసి ఆత్మగౌరవంతో దళితులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఉద్దేశించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు తొలి ఫలాలు లబ్ధిదారుల చేతికి అందాయి.
దళితబంధు లక్ష్యం..
రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబాన్ని ఆదుకోవడం. దళిత కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, తద్వారా దళితుల్లో తాము ఎవరికన్నా తక్కువ కామనే ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. సమాజంలో దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడం. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడమే దళితబంధు లక్ష్యం.
మొదటి విడుతలో నియోజకవర్గానికి వంద చొప్పున..
నిజామాబాద్ జిల్లాలో మొదటి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 100 చొప్పున దళితబంధు యూనిట్లు మంజూరు చేసి దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. కామారెడ్డి జిల్లాలో నియోజకవర్గానికి 100 చొప్పున, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వందశాతం యూనిట్లు 1298 కుటుంబాలకు అందజేశారు. దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులంతా లాభాల బాటలో పయనిస్తుండడం విశేషం.
రెండో విడుతలో 1100 చొప్పున..
రెండో విడుత కింద నియోజకవర్గానికి 1100 మందికి దళితబంధు అందించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ దఫా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,29,800 కుటుంబాలకు అందజేయనుండగా, మరో 200 మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అప్పగించారు. మొత్తంగా రాష్ట్రంలో 1,30,000 కుటుంబాలకు దళితబంధును అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గానికి 1100 చొప్పున మొత్తం 9,900 కుటుంబాలకు దళితబంధు అందనున్నది.
మొదలైన ప్రక్రియ..
దళితబంధు పథకం అమలుతో ఉమ్మడి జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీలు, కారు డ్రైవర్లుగా తదితర పనులు చేసిన వారు దళితబంధు యూనిట్లు పొంది ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. రెండో విడుత కూడా ప్రకటించడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. యూనిట్లకు సంబంధించి ఆయా రంగాల్లోని నిపుణులతో మొదట అవగాహన కల్పించి, లబ్ధిదారులు వ్యాపారాల్లో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
కామారెడ్డి జిల్లాలో 3850 కుటుంబాలకు..
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియోజకవర్గానికి 1,100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. దీంతో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 3,300, కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గ మండలాల్లోని 550 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనుండడంతో దళితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 6,050 యూనిట్లు..
నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గానికి 1,100 చొప్పున మొత్తం 6,050 మందికి దళితబంధు రెండో విడుత ఫలాలు అందనున్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు 1,100 చొప్పున, నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గ మండలాలకు 550 యూనిట్లు మంజూరు కానున్నాయి.
దళితులను గుర్తించింది కేసీఆర్ సారే
మాలాంటి దళితులను గుర్తించింది కేసీఆర్ సారు ఒక్కరే. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినయి కానీ మా బతుకులు మాత్రం మారలేదు. కేసీఆర్ సారు వచ్చిన తర్వాతే మా జీవితంలో మార్పులు మొదలయ్యాయి. పక్కనే ఉన్న నిజాంసాగర్ మండలంలో దళితుందరికీ దళితబంధు పథకం కింద పది లక్షల చొప్పున అందజేయడంతో ఒక్కో కుటుంబం వ్యాపారాలు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు తీసుకొని మంచిగా బతుకుతున్నారు. మాకు కూడా ఇస్తే బాగుండేది అనుకున్నం. అలాంటిది దళితులందరికీ పథకాన్ని అందజేసేందుకు మరో విడుత ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉంది.
– జంగం లక్ష్మన్, పిట్లం
మా పాలిట దేవుడు.. కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దేవుడు. అడగక ముందే వరాలు ఇస్తూ అందరినీ సంతోషపరుస్తున్నాడు. దళితబంధు పథకంతో మాలాంటి దళితుల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాడు. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తుండడంతో ముఖ్యమంత్రి సారు చెప్పినట్లు మా కాళ్ల మీద మేము నిలబడి ఏదైనా వ్యాపారం చేసుకొని సంతోషంగా జీవిస్తాం. సంఘంలో గౌరవం వచ్చేలా ముందుకు సాగుతాం. మాలాంటి దళితులకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. సీఎం కేసీఆర్ త్వరలో మా అందరి రాత మార్చబోతున్నాడు.
– భీమయ్య, పెద్దదేవాడ, బిచ్కుంద మండలం
దళితులకు లభించిన గౌరవం
దళితులకు సరైన గౌరవం లభిస్తున్నది. దళితబంధు పథకం కింద పది లక్షల రూపాయల చొప్పున అం దజేయడం సంతోషంగా ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో లేని పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం గొప్ప విషయం. ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల చొప్పున అందజేయడం మాములు విషయం కాదు. ఇప్పటికే జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం కింద పది లక్షల రూపాయలు అందజేశారు. ఇప్పుడు మాకు కూడా అందజేయనుండడం సంతోషంగా ఉన్నది.
– లింగురాం, మద్నూర్
ధన్యులమయ్యాం…
ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన అనుభవం ఉన్నది. ఆర్థిక స్థోమత లేక సొంతగా షాప్ పెట్టుకోలేకపోయాను. ఎవరినైనా అప్పులు అడిగితే ఇవ్వలేదు. పైగా వడ్డీ ఎక్కువగా చెప్పడంతో ఏమీ చేయలేకపోయాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టగానే అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా దగ్గరికి వెళ్లాను. వెంటనే నాబాధ విని దళితబంధు ఇప్పించారు. ఆ డబ్బులతో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాను. నా కుటుంబసభ్యులు 8 మందిమి కలిసి పని చేసుకుంటున్నాం. ఎవరిమీద ఆశపడకుండా సంతోషంగా ఉన్నాం. సీఎం కేసీఆర్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు ధన్యవాదాలు.
– ప్రసాద్, సంజీవయ్య కాలనీ
మరింత మందికి మేలు..
దళితబంధు పథకం రెండో విడుతను ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. మొదటి విడుతలో యూనిట్లు పొందిన లబ్ధిదారులు చాలా మంది లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో మరింత మందికి మేలు చేకూరనున్నది. ఈ పథకం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. దళితుల్లో పేదరికం ఉండకుండా పోతుంది.
– సతీశ్, నిజామాబాద్