వినాయక్ నగర్,సెప్టెంబర్ 14: విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి, కటకటాలకు పంపించారు. సదరు మోసగాడిపై రాష్ట్రంలోనే మొదటిసారి సైబర్ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి,పీడీ (ప్రివెన్షన్ డిటెన్షన్)యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఉన్న సుచిత్రా, వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉండే కోలనాటి నాగశివ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కొంతమంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్లుగా అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారిని లావోస్,థాయిలాండ్ దేశాలకు పంపించాడు. అక్కడ నాగశివకు చెందిన ముఠా సభ్యులు జిల్లాకు చెందిన యువకుల నుంచి పాస్‌పోర్టులు తీసుకొన్నారు.
అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా తన ముఠా సభ్యులతో బలవంతం చేయించిన నాగశివను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న నాగశివపై పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌తోపాటు ఆర్మూర్, సిరిసిల్ల జిల్లాలోని చందూర్తి పోలీస్ స్టేషన్లలో ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నాగశివపై 1986 తెలంగాణ పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.