‘చెన్నై నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. అన్ని వర్గాలూ చూడదగ్గ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ సినిమా చూసి, నచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను’ అని నిర్మాత, పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి కథానాయిక. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది ఈ సినిమాలో ఓ పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది.
మిగతా అంతా ప్రేమకథే. హీరో నెల్లూరు నుంచి చెన్నై వెళ్లి అక్కడ ఇంటీరియర్ డిజైనర్‌గా సెటిలవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. హీరోయిన్ చిత్తూరు నుంచి చెన్నై జాబ్ కోసం వస్తుంది. వీరిద్దరూ కలిశాక ఏమైంది అనేది ఈ సినిమా కథ. సంతోష్‌శోభన్ చాలా సెటిల్డ్‌గా చేశాడు. ఈ సినిమాతో సంతోష్‌శోభన్ మంచి స్టార్‌గా ఎదగాలని ఆశిస్తున్నాం’ అని కోరారు ధీరజ్ మొగిలినేని. చిత్ర దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ మనసులు తాకేలా సినిమా తెరకెక్కించారని, పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ని ఆయన తయారు చేసుకున్నారని, ఇది యూవీక్రియేషన్స్ నమ్మి చేసిన కథ అని ధీరజ్ మొగిలినేని చెప్పారు. ప్రస్తుతం మా సంస్థపై ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రం రూపొందుతున్నదని, అలాగే సంతోష్ శోభన్ హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నామని, కొందరు స్టార్ హీరోలతో స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఈ ఏడాది కచ్చితంగా ఓ స్టార్ హీరోతో సినిమా ప్రకటిస్తామని, అలాగే ఓ బాలల చిత్రం కూడా నిర్మిస్తున్నామని, అది ఈ సమ్మర్లో విడుదల కానున్నదని ధీరజ్ మొగిలినేని తెలిపారు.