ధర్పల్లి/సిరికొండ, ఏప్రిల్ 18 : ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నేలరాలి చేతికందకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో మోస్తరు వర్షం కురిసినప్పటికీ కేవలం నడిమి తండా, ముత్యాల చెరువు మీదుగా వడగండ్లు పడడంతో పంట దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. ఈదురుగాలుల కారణంగా నడిమి తండాలో ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. అకాల వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.
సిరికొండ మండలం సర్పల్లి తండా, తాళ్ల రామడుగు, మూషీనగర్, గడ్కోల్, కొండూర్, రావుట్ల తదితర గ్రామాల్లో ధాన్యం తడిది ముద్దయ్యింది. వరి పైరు నేలవాలింది. ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు వాపోతున్నారు.