హైదరాబాద్, జూలై 24 (నమస్తేతెలంగాణ): ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్తింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి యువతీయువకులు వేలాదిగా తరలివవచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వేదికగా ఉద్యమిస్తున్న విద్యార్థి లోకానికి అండగా ఉన్నామంటూ సంఘీభావం ప్రకటించారు. ‘నీట్ నాట్ నీట్..వి ఆర్ స్టూడెంట్స్..నాట్ టెర్రరిస్ట్స్..జెన్ జీ ఫర్ జెన్ జీ.. వీ డోన్ట్ కీప్ ఆవర్ మౌత్స్ షట్.. ఎడ్యుకేషన్ మినిస్టర్..మస్ట్ రిజైన్’అంటూ చేసిన నినాదాలతో ఇందిరాపార్క్ ప్రాంగణం దద్దరిల్లింది. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ముక్తకంఠంతో యువత డిమాండ్ చేసింది.
కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన
ఇందిరాపార్క్ వద్ద నిరసనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా ఆయన బ్లాక్ షర్ట్ వేసుకున్నారు. ఆయన అక్కడికి చేరుకోగానే యువతీయువకులు ఒక్కసారిగా ముందుకువచ్చారు. కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. వారిస్తున్నా వినకుండా కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. ఆయన ప్రసంగించేందుకు లేవగానే చప్పట్లతో హోరెత్తించారు. ‘వీ వాంట్ జస్టిస్..మోదీ..విద్యార్థులపై దమనకాండ ఆపాలి..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..ఢిల్లీలో పోలీసుల జులుం నశించాలి’ అంటూ కేటీఆర్ నినదించగా యువతీయువకులు ప్రతిస్పందించారు.
కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఎంతో ఆసక్తిగా విన్నారు. ‘యువత పొట్టు పొట్టు కోపం మీదున్నరు..మెట్టు మెట్టు ఎక్కుతరు..నీ ప్రభుత్వాన్ని తొక్కుతరు..మోదీ యాది పెట్టుకో’అని హెచ్చరించగా యువకులు ఈలలు వేస్తూ చేతులు పైకెత్తి స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించిన సందర్భంలోనూ చప్పట్లు కొడుతూ మద్దతుపలికారు. కేసీఆర్ పేరును ప్రస్తావించినప్పుడల్లా ఉత్సాహంగా ఈలలు వేశారు. ప్రసంగం ముగించి వేదిక దిగుతున్న సమయంలో పెద్దసంఖ్యలో ఆయన వద్దకు చేరుకున్నారు. పెద్దపెట్టున నినాదాలు చేయగా కేటీఆర్ సైతం వారిని అనుసరించారు. కేటీఆర్ ఉపన్యాసమంతా జెన్‌జీలను చైతన్యపరుస్తూ సాగింది. కేటీఆర్ తన 50వ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండి యువతకు మద్దతుగా నిలబడటం తమకు గర్వంగా ఉన్నదని యువత పేర్కొన్నది. ‘కేటీఆర్ హ్యాపీ బర్త్‌డే’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
బీఆర్ఎస్లో జోష్
ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన సక్సెస్ కావడంతో గులాబీ పార్టీలో జోష్ నిండింది. వారం క్రితం సరూర్‌నగర్ గ్రౌండ్లో యువ సంగ్రామ సదస్సు.. తాజాగా ఇందిరాపార్క్ వద్ద నిరసనకు వేలాది మంది యువకులు స్వచ్ఛందంగా తరలిరావడంతో బీఆర్ఎస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.. పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని రాష్ట్ర నలుమూలల నుంచీ తెలంగాణ యువత కదిలిరావడం బీఆర్ఎస్ను ఆదరిస్తున్న తీరుకు అద్దంపడుతున్నదని చెప్తున్నారు.. సభల్లోనూ వారు స్పందించిన తీరు కేసీఆర్ నాయకత్వంపై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై యువతకు కోపం ఉన్నదని రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం బూటకమని తేలిపోయిందని స్పష్టంచేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మేలు తెలుసుకున్న తర్వాతే కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారని చెప్తున్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తమ కలలు సాకారమవుతాయని భావిస్తున్నారని పేర్కొంటున్నారు. కాగా, ఇందిరాపార్క్ నిరసన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన యువతీ, యువకులకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.