ధర్పల్లి/సిరికొండ, ఫిబ్రవరి 11: పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు వట్టిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్ల ముందే పంట వాడిపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. పొట్టకొచ్చిన వరి ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ట్యాంకర్లతో నీళ్లు పడుతూ పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ లొంక తండాకు చెందిన రైతులు బానవత్ మంగీలాల్, సుంకరి అంజయ్య నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం అది పొట్ట దశకు వచ్చింది. ఇంకో పక్షం రోజులు నీళ్లు పెడితే పంట చేతికొస్తుంది. కానీ, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోయాయి. దీంతో రెండు ఎకరాల్లో సాగు చేసిన వరి ఎండిపోయింది. మిగిలిన రెండెకరాలను కాపాడుకునేందుకు మంగీలాల్, అంజయ్య భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు బోర్లు వేశారు కానీ చుక్కనీరు రాలేదు. పొట్ట దశలో ఉన్న పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు పెడుతున్నారు. ఇందుకోసం నిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పంట సాగు పెట్టుబడితో పాటు బోర్లు వేయించడానికి భారీగా వెచ్చించారు. ఇప్పుడేమో రోజుకు రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మరో 15 రోజులు నీళ్లు పెడితే పంట చేతికొస్తుందని రైతులు చెబుతున్నారు. అయితే, ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన పొలాలను సర్వే చేసి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.
భూగర్భజల వనరులు అడుగంటి పోతుండడంతో నీరందక పొలాలు ఎండుతున్నాయి. పచ్చని పైర్లు వాడిపోతుండడంతో రైతులు ఆందోaళన చెందుతున్నారు. ధర్పల్లి మండలంలో రైతులు ఎప్పటిలాగే ఈ యాసంగిలోనూ పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. అయితే, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు పోయడం లేదు. ధర్పల్లి శివారులోని రేకులపల్లి రోడ్డులో వేసిన వరి పైరు నీరందక ఎండిపోయింది. పొలం నెర్రెలు వారింది. ఇలాంటి స్థితిలో పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. నీరందక పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.