నిజామాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బ కొట్టాయి. చేతికొచ్చిన పంట ఎటూ కాకుండా పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, పంట నష్టం అంచనాల సేకరణ అంతంత మాత్రంగానే కొనసాగుతుండడం, ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం ఓదార్చేందుకు రాకపోవడంతో కర్షకులు మరింత కుంగిపోతున్నారు. రానున్న రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ ప్రకటనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా పంట కోసే సమయంలో వర్ష సూచన రావడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో బోధన్, రూరల్ నియోజకవర్గాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో పంటలకు నష్టం జరిగింది. బలమైన గాలులకు ధాన్యం గింజలు నేలరాలాయి. నిన్నా మొన్నటి వరకూ సాగునీటి కష్టాలను తట్టుకుని పంటలను కాపాడుకున్న రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ధాన్యం అమ్ముకుని నష్టాల నుంచి బయట పడుతామనుకునే లోపే అకాల వర్షం ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. బోధన్, కోటగిరి, పోతంగల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పంట నష్టం సంభవించింది.
పంట నష్టంపై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. గురు, శుక్రవారాల్లో పడిన వర్షాలతో జరిగిన నష్టం అంచనాలు ఇంకా సిద్ధం చేయలేదు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో మొక్కుబడిగా తిరుగుతూ నష్టం అంచనాలు సేకరించే పనిలో పడ్డారు. అధికారికంగా వివరాలు వెల్లడించకపోగా, రైతులను ఓదార్చే వారు కరువయ్యారు. మరోవైపు చేతికొచ్చిన పంటను కోసి అమ్ముకుందామంటే ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలు సిద్ధంగా లేవు. అధికారికంగా ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ధర్పల్లి/సారంగపూర్, మార్చి 22: రెండ్రోజుల క్రితం కురిసిన వడగండ్లతో ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధర్పల్లి మండలంలోని వాడి, మద్దుల్ తండాలో వడగండ్లు పడి ధాన్యం గింజలు పూర్తిగా రాలిపోయాయి. హోన్నాజీపేట్ గ్రామశివారులోనూ పంటలు దెబ్బ తిన్నాయి. సారంగపూర్ మండలం పాల్దలోనూ వరి పైర్లు నేలకొరిగాయి. నిన్న, మొన్నటిదాకా చివరి తడికి నీరందక రైతులు సగం పంటను వదిలేశారు. మిగిలిన సగం పంటను వాటర్ ట్యాంకుల ద్వారా నీరందిస్తూ కాపాడుకున్నారు. పంట కోసే సమయానికి వడగండ్లు పడి ధాన్యం నేలరాలడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షం రైతులను తీవ్రంగానే దెబ్బకొట్టింది. వాడి, దమ్మన్నపేట్ గ్రామాల్లోనే 174 మంది రైతులకు చెందిన 265 ఎకరాల వరి పంట దెబ్బ తిన్నాయి. వాడి, మద్దుల్ తండా, సీతాయిపేట్, హోన్నాజీపేట్ తదితర ప్రాంతాల్లో దెబ్బ తిన్న వరి పంటలను రూరల్ ఏడీఏ ప్రదీప్‌కుమార్, ఏవో వెంకటేశ్ పరిశీలించారు. పెట్టుబడి ఖర్చు కూడా మిగలకుండా పోయిందని, తమను ఆదుకోవాలని రైతులు వ్యవసాయాధికారులకు మొరపెట్టుకున్నారు. పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంట కోత దశకు చేరింది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో గతంలో మాదిరిగానే ఈసారి కూడా వరి అత్యధికంగా సాగైంది. 4.20 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 45,993 హెక్టార్లలో దొడ్డు రకం, 23,868 హెక్టార్లలో సన్న రకం ధాన్యాన్ని సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దొడ్డు, సన్నరకాలు కలిపి మొత్తంగా 11,82,783 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 2,85,783 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం నిల్వ చేసుకోగా, దాదాపుగా 9 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దిగుబడి అంచనాల ఆధారంగా ఈసారి నిజామాబాద్ జిల్లాలో 664 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అకాల వర్షం, వడగండ్లతో పంటలు దెబ్బ తినగా, వ్యవసాయ శాఖ ఇంకా నివేదికల రూపకల్పనలోనే నిమగ్నమైంది. వివరాలు మాత్రం వెల్లడించలేదు. పంట నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్నో కష్టాలకోర్చి, సాగునీటి ఇక్కట్లు అధిగమించి పండించిన పంట చివర్లో అనుకోని వానలతో దెబ్బ తినడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు, నీళ్లు లేక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఎంతో మంది రైతులు ఇప్పటికే నష్టాలను మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సరిగా నీళ్లు అందక పెట్టుబడి డబ్బులు కూడా కోల్పోయిన తమను కూడా ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. పరిహారాన్ని తమకు కూడా వర్తింపజేయాలని పంట ఎండిపోయిన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.