వర్ని/ ఖలీల్‌వాడి, ఏప్రిల్ 8 : సింగరేణిని ప్రైవేటీకరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కడతారని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై పలు గ్రామాల్లో నాయకులు శనివారం నిరసన వ్యక్తంచేశారు. వర్ని మండలకేంద్రంలో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తంచేశారు. మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన హార్టికల్చర్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీలను అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కటారి రాములు, సాయిబాబా, లక్ష్మి, సావిత్రి, దత్తు, అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం ఎదుట ఆ పార్టీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి వివిధ సందర్భాల్లో బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన హక్కులు, వాటాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, రఘురాం, రంజిత్, హన్మాండ్లు, అనిల్, సురేశ్, దేవేందర్, భాగ్యలక్ష్మి, కవిత, హైమదీ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని ధర్నాచౌక్ వద్ద సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పీఎం గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం వేస్తున్నదన్నారు. మతోన్మాద విధానాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని, ఆయనకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, సబ్బని లత, ఎం.గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, సుజాత, నగర కమిటీ సభ్యులు మహేశ్, కృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.