సిరికొండ : తెలంగాణ బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ (ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వీ ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై సవతితల్లి ప్రేమ కనబర్చుతోందని, వైద్యంపై నిధుల కోత పెట్టిందని, వ్యవసాయ కూలీలకు నిధుల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉన్నదని ఆయన అన్నారు. బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో జరిగిన సీపీఐ (ML) మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామిక పరిరక్షణను ఆరో గ్యారంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా ఆ హామీని అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుత బడ్జెట్ తెలంగాణ ప్రజల మోచేతికి బెల్లం పెట్టి అరచేతిని నాకమన్నట్లుగా ఉందని విమర్శించారు. వ్యవసాయ రంగం ప్రధానమైనది అంటూనే ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు. సంక్షేమ రంగంలో సర్కారు విఫలమైందని అన్నారు. బడ్జెట్లో పసుపు రైతులపట్ల ఏమాత్రం కరుణ చూపలేదని విమర్శించారు.
సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి ఇతర పంటలు పండించే రైతులకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం రైతు నాయకులపై తెలంగాణ ఉద్యమ సమయంలో, రైతాంగ పోరాటాల సమయంలో పెట్టిన కేసులను ఇప్పటికీ కొట్టివేయలేదని అన్నారు. సమావేశంలో సీపీఐ (ML) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పీ రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బీ దేవారం, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, POW రాష్ట్ర ఉపాధ్యక్షులు వీ గోదావరి, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జీ సురేష్, పార్టీ జిల్లా, డివిజన్, మండల నాయకులు ఎస్ సురేష్, ఎం ముత్తన్న, కే రాజేశ్వర్, జీ కిషన్, ఏ ప్రకాష్, జీ పరమేష్, ఆర్ దామోదర్, బీ కిషన్, పీ రమ, ఆర్ పుష్పలత, బీ బాబన్న, పీ అంబన్న, బీ కిషోర్, ఎం లింబన్న, ఈ రమేష్, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.