నిజామాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో అవినీతి జలగల ఆట కట్టించకపోవడం అనేక విమర్శలకు తావిస్తున్నది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న 12 మందిని గుర్తించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. కానీ, కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న కొందరు ఖాకీలపై కన్నేయకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది.
కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మనే నిజామాబాద్ ఇన్చార్జి సీపీగా కొనసాగుతున్నారు. నిజామాబాద్లో కళంకితులను గుర్తిస్తుండగా, కామారెడ్డిలోనూ అలాంటి వారిపై విచారణ చేపట్టకపోవడం వెనుక ఉన్న ఒత్తిళ్లు ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అధికార పార్టీ నేతల సిఫారసుతో పోస్టింగ్లు తెచ్చుకున్న వారు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నా వారి విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. రాజకీయనేతల ఒత్తిడికి భయపడి చర్యలకు వెనుకాడుతున్నారనే అపవాదును కామారెడ్డి జిల్లా పోలీసులు మూటగట్టుకుంటున్నారు.
బిచ్కుంద, బీర్కూర్ శివారుతో పాటు మద్నూర్, పిట్లం, నస్రూల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, డోంగ్లి మండలాల్లో ఇసుక అక్రమ దందా భారీగా జరుగుతున్నది. రాత్రి కాగానే గద్దల్లా వాలిపోయి మంజీరా నుంచి ఇసుకను తోడేస్తున్నారు. బాన్సువాడ డివిజన్లో ఓ సీఐపై అనేక ఆరోపణలున్నాయి. నిజామాబాద్ కమిషనరేట్లో పని చేసిన సమయంలోనే సిద్దిపేటకు ట్రాన్స్ఫర్ కాగా, ఓ ఎమ్మెల్యేకు సామాజిక వర్గం పేరుతో దగ్గరై కీలక పోస్టింగ్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. స్థానిక లీడర్ పేరు చెప్పి ఇసుక దందాకు మద్దతుగా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
మహారాష్ట్ర సరిహద్దులో పని చేసే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ తీరుపైనా అనేక విమర్శలున్నాయి. సర్కిల్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఎస్సైలు వాహనాల సామర్థ్యాన్ని బట్టి రేట్లు ఫిక్స్ చేసి వసూళ్లకు తెగబడుతున్నట్లు చెబుతున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ ఇసుకను తీసుకుని ఠాణా గేట్ల ముందు నుంచే దర్జాగా వెళ్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఖాకీలు కండ్లు మూసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కీలక నేతల ఆదేశాలతో హస్తం పార్టీ లీడర్ల టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు దర్జాగా ఇసుకను తరలించుకు పోతున్నాయి. ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే స్పందించని కొందరు పోలీసులు.. ఫిర్యాదు చేసిన వ్యక్తినే బెదిరింపులకు గురి చేస్తుండడంతో అక్రమాలను ఎదురించేందుకు ఎవరూ ముందుకు
రావడం లేదు.
బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ దందా జోరుగా నడుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్కారు ఆదాయానికి గండికొడుతూ భారీగా దండుకుంటున్నారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న వారిలో రెవెన్యూ, మైనింగ్, టీజీఎండీసీ అధికారులతో పాటు పోలీసులు సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీ నేతల ద్వారా ‘ఆదాయం వచ్చే స్థానాల్లో’ పోస్టింగ్లు తెచ్చుకున్న కొందరు పోలీసు అధికారులు.. అక్రమ ఇసుక దందాకు పరోక్ష మద్దతుగా నిలుస్తూ దండుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ కామారెడ్డి పోలీసులపై ఈగ వాలకపోవడం అనేకు అనుమానాలకు తావిస్తున్నది. వారిని కాపాడుతున్నదెవరనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నది.
నిజామాబాద్ కమిషనరేట్లో ఇసుక అక్రమార్కులను నిలువరించని కారణంగా పలువురు పోలీసులపై కన్నేసిన నిఘా వర్గాలు సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎవరెవరు ఎంతెంత మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారో పూసగుచ్చినట్లు డీజీపీకి వివరాలు సమర్పించాయి. అయితే, కామారెడ్డిలో పెద్ద ఎత్తున జరిగే ఇసుక దందాలో పాత్రధారులుగా నిలుస్తున్న పోలీసులపై నిఘా పెట్టక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఇసుక అక్రమ వ్యవహారంలో పోలీసుల పాత్రను నిగ్గు తేల్చి చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డిలో మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది. ఖాకీలకు ఖద్దరు అండగా నిలుస్తుండడమే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతున్నది.