లింగంపేట, నవంబర్ 14: అవినీతి అధికారులతో పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నది. కొందరు అక్రమార్కుల కారణంగా డిపార్ట్మెంట్ మొత్తం ప్రజల్లో పలుచనవుతున్నది. తప్పుచేసిన వారితో ఊచలు లెక్కించే పోలీసులే లంచాలకు మరిగి జైలుపాలవుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు డబ్బు తీసుకుంటూ వర్ని ఎస్సై కృష్ణకుమార్ ఇటీవల రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన లింగంపేట ఎస్సై అరుణ్ కూడా చేసి ఏసీబీ వలలో చిక్కడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం మరోమారు చర్చనీయాంశమైంది.
లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన కొందరు రెండు నెలల క్రితం విందు చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని కోర్టులో హాజరుపరచుకుండా ఎస్సై డబ్బులు తీసుకుని, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా బైండోవర్ చేసినందున కచ్చితంగా స్టేషన్ బెయిల్ తీసుకోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.
స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేయగా, రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడానికి అంగీకరించని నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు గురువారం మధ్యాహ్నం పోలీసుస్టేషన్లో రైటర్ రామస్వామికి డబ్బులు ఇస్తున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై అరుణ్ ఆదేశాల మేరకే రైటర్ డబ్బులు తీసుకున్నట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి, హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేకకోర్టులో హాజరుపరచనున్నట్లు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వేణుకుమార్, నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
లింగంపేట ఠాణాపై ఏసీబీ దాడులు జరగడం, ఎస్సై అరుణ్ ఏసీబీకి చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. మూడు నెలల క్రితం సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో వీఆర్‌లో ఉన్న అరుణ్ బదిలీపై లింగంపేటకు వచ్చారు. దీపావళి సందర్భంగా బాణాపూర్ గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్‌లో పేకాడుతూ పట్టుబడిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్తను ఎస్సై డబ్బులు తీసుకుని కేసు నుంచి తప్పించినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి.లింగంపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో పేకాటరాయుళ్లను స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించగా, వారి వద్ద నుంచి సైతం భారీగా డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎస్సై ఏసీబీకి చిక్కాడన్న వార్త తెలిసి స్టేషన్‌కు వచ్చిన కొందరు పేకాటరాయుళ్లు తమ ఉసురు తగిలిందని హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.