Banswada | బాన్సువాడ పట్టణం అభివృద్ధికి చిరునామాగా మారింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో సుందరంగా ముస్తాబైంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన నాటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. విద్య, వైద్య రంగాలకు బాన్సువాడ హబ్‌గా మారింది. కేజీ నుంచి పీజీ వరకూ అన్ని విద్యాలయాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. జిల్లా దవాఖానతో పాటు మాతాశిశు సంరక్షణ కేంద్రం ద్వారా కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయి. సుమారు వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సింహభాగం పూర్తవ్వగా, మిగతావి చివరి దశలో ఉన్నాయి. ఒకనాడు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు.. ఇప్పుడు అద్దాల్లా మెరుస్తున్నాయి. నల్లతాచుల్లా పట్టణం నలుమూలలా విస్తరించాయి. మినీ ట్యాంక్‌బండ్ బాన్సువాడకు మణిహారంగా మారింది. పార్కులు, ఆలయాలు, కమ్యూనిటీ భవనాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా బాన్సువాడకు పలు అవార్డులు వరించాయి.
బాన్సువాడ, మార్చి 13: రాష్ట్ర ప్రభుత్వ సహకారం.. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో బాన్సువాడ పట్టణం అభివృద్ధికి చిరునామాగా మారింది. విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పోచారం సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకురావడంతో సుందర పట్టణంగా రూపుదిద్దుకుంటున్నది. బాన్సువాడ మేజర్ పంచాయతీ నుంచి స్వరాష్ట్రంలో 2018 జనవరిలో మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 32 వేల మంది ఉండగా ప్రస్తుతం 40 వేలకు చేరుకున్నది. పట్టణం సుమారు 16 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణం కూడా విస్తరిస్తున్నది. రూ.1.5 కోట్లతో వైకుంఠధామం, రూ.20 కోట్లతో వంద పడకల మాతాశిశు దవాఖానను నిర్మించారు. దవాఖానలో రూ.5 కోట్లతో అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. క్రీడాకారుల కోసం రూ.రెండు కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియాన్ని నిర్మించారు. పట్టణంలో రూ.2.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ భవనం కోసం ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరుచేసింది. పట్టణ నడి బొడ్డున ఉన్న కల్కి చెరువును రూ.6.70 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి అందుబాటులోకి తెచ్చారు. కల్కి చెరువు సమీపంలో సుమారు రూ.4 కోట్లతో మల్టీ జనరేషన్ పార్కు( చిల్డ్రన్ పార్కు) నిర్మాణ పనులు సాగుతున్నాయి. బాన్సువాడకు బీఎస్సీ నర్సింగ్ కళాశాల మంజూరుకాగా, సుమారు రూ. 40 కోట్లతో ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో భవన నిర్మాణ పనులు చురుగ్గా చేపడుతున్నారు. పట్టణంలోని కుల సంఘాల భవనాలు, ఆలయాలు, జనరల్ ఫంక్షన్ హాల్స్, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు తదితర పనులకు స్పీకర్ పోచారం స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.కోట్ల నిధులు మంజూరు చేయించారు.
పట్టణంలోని తాడ్కోల్ శివారులో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి అర్హులకు కేటాయించి, గ్రేటర్ కమ్యూనిటీగా తీర్చిదిద్దారు. పట్టణంలోని ప్రాంతాల్లో మరో 1400 ఇండ్లు సొంత స్థలాల్లో నిర్మించుకోవడానికి ప్రభుత్వ బిల్లులు మంజూరు చేసింది. ఒక్క బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోనే 2,400 డబుల్ బెడ్ రూం ఇండ్లకు ప్రభుత్వం సుమారు రూ.120 కోట్ల నిధులు కేటాయించడం విశేషం. దీంతో పేద ప్రజలు సొంత ఇండ్లలో సంతోషంగా ఉన్నారు.
పట్టణ పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు మొదలుకొని డిగ్రీ, పీజీ వరకు కాలేజీలు ఉన్నాయి. బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. బాలుర జూనియర్ కళాశాల భవనాన్ని రూ.రెండు కోట్లతో నిర్మించారు. ఇంటర్ కళాశాల(ఉర్దూ మీడియం) భవనాన్ని రూ.70 లక్షలతో నిర్మించి, ప్రారంభించారు. దీంతో బాన్సువాడ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది.
బాన్సువాడ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ (2020 -2021)లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో అవార్డు వరించింది. పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంతో భూముల ధరలు గతంలో రూ.లక్షల్లో ఉండగా నేడు రూ. కోట్లు పలుకుతున్నాయి.
బాన్సువాడ అభివృద్ధికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషి ఎనలేనిది. మంచి నాయకుడి హయాంలో నేను పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. స్పీకర్ పోచారం ప్రజల మనిషి. రూ.వేయి కోట్లకుపైగా నిధులు తెచ్చి పట్టణాన్ని సుందరంగా మార్చారు. బాన్సువాడ రూపురేఖలే మారాయి. పట్టణ ప్రజల పక్షాన స్పీకర్‌కు కృతజ్ఞతలు.
-జంగం గంగాధర్, మున్సిపల్ చైర్మన్
సభాపతి పోచారం సార్ అభివృద్ధిలో ఒక రోల్ మోడల్. బాన్సువాడ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందంటే.. అది కేవలం స్పీకర్ పోచారం ముందుచూపుతోనే సాధ్యమైంది. పేదల కోసం ఎక్కడా లేనివిధంగా వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు నిర్మించి వారి ముఖాల్లో సంతోషం నింపారు. పట్టణం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది.
-షేక్ జుబేర్, మున్సిపల్ వైస్ చైర్మన్
ఒక నాయకుడిగా చేసే ప్రతి. పని బతికినన్నాళ్లు ప్రజలకు గుర్తుండాలి. ఒక ఎమ్మెల్యేగా చేసే పనిలో పేదల ముఖా ల్లో సంతోషం కనబడాలి. వారి ముఖాల్లో ఆనందం చూడాలన్నదే నా సంకల్పం. బాన్సువాడ నియోజక వర్గ ప్రజలే నా కుటుంబం. కులమతాలకు అతీతంగా అన్ని మతాలను గౌరవించేలా నిధులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశా. పేదల సొంతింటి కలను సాకారం చేసిన. నన్ను నమ్ముకున్న ప్రజలను సంతోషంగా ఉంచడంలోనే నాకు ఆనందం.
– పోచారం శ్రీనివాసరెడ్డి, సభాపతి