భిక్కనూరు, ఏప్రిల్ 22 : మొక్కలు నాటి భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కాంట్రాక్ట్ అధ్యాపకులు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా క్యాంపస్ ఆవరణలో మొక్కలు నాటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సేవ్ ఎర్త్, సేవ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ ఎస్. నారాయణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు రక్షించబడాలంటే యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
తాము యూనివర్సిటీ స్థాపన నుండి పనిచేస్తున్నామని, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దామన్నారు. కానీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై స్పందించకపోవడంతో తమ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నిరంజన్, వైశాలి, సరిత, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.