స్వచ్ఛతే లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు జనాభా అవసరాలకు అనుగుణంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆయా మున్సిపాలిటీల్లో నిర్మాణాలను పూర్తి చేసింది. వెయ్యి జనాభా పరిధిలో ఒక కమ్యూనిటీ టాయిలెట్ ఉండేలా చర్యలు అధికారులు తీసుకున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సగానికి పైగా ఇబ్బందులు తీరినట్లే అయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఏడు పురపాలక సంఘాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలను పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల నుంచి సిటీకి వచ్చేవారికి అనువుగా అత్యవసరాలను తీర్చుకునేలా ఏర్పాట్లు చేయడంపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమాల అమలులో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును సాధించింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే స్వతహా రాష్ట్రంలో అనేక ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తున్నది. మిగిలిన రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. నగరాలు, పట్టణాల్లో నిత్యం ప్రజలకు ఎదురయ్యే ఆత్మగౌరవ సమస్యను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో పరిష్కార మయ్యింది. ఆడ, మగ తేడా లేకుండా అత్యవసరాలకు సౌకర్యాలు లేక పడుతున్న ఇబ్బందులను గుర్తించి జనావాసాల్లో ప్రజల రద్దీకి తగ్గట్లుగా మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించింది. సామాజిక సమస్యగా ఏండ్లుగా మూలన పడ్డ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆయా మున్సిపాలిటీల్లో నిర్మాణాలను పూర్తి చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ఏడు పురపాలక సంఘాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల నుంచి సిటీకి వచ్చేవారికి అనువుగా అత్యవసరాలను తీర్చుకునేలా ఏర్పాట్లు చేయడంపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో 2011 జనాభాను అనుసరించి 15వేల నుంచి 32వేల జనాభా వరకు ఉంది. బోధన్, ఆర్మూర్ పాత మున్సిపాలిటీ ల్లో లక్షకు చేరువైంది. కామారెడ్డి లాంటి మున్సిపాలిటీ లక్ష జనాభా దాటిపోయింది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో జనాభా 3లక్షలు దాటింది. వెయ్యి జనాభా పరిధిలో ఒక కమ్యూనిటీ టాయిలెట్ ఉండాలని సూచించిన నేపథ్యంలో పురపాలక సంఘాల పరిధిలో ఇందుకు అనుగుణంగా పనులు ప్రారంభమయ్యాయి. కమ్యూనిటీ టాయిలెట్లను బీవోటీ(బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో నిర్మించారు. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మించింది. కమ్యూనిటీ టాయిలెట్లో ఒక్కటైనా మహిళలకు ప్రత్యేకంగా నిర్మించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఏర్పాట్లతో సగానికి పైగా ఇబ్బందులు తీరినట్లే అయ్యింది. జన బాహుళ్య ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోనే పబ్లిక్ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మించింది.
నిజామాబాద్ నగరపాలక సంస్థలో రూ.5కోట్లతో 46 ప్రాం తా ల్లో సులభ్ కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశా రు. ఆర్మూర్‌లో నాలు గు చోట్ల పాతవి ఉన్నప్పటికీ వాడుకలో లేవు. కొత్తగా 3 ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. బోధన్‌లో ఆరు ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉండగా కొత్తగా మరో ఆరు చోట్ల నిర్మించారు. భీంగల్‌లో మూడు ప్రాంతాల్లో 15 మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చా యి. కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. కామారెడ్డి పురపాలక సంఘంలో 9 ప్రాంతాల్లో 83 మూత్ర శాలలు, మరుగుదొడ్లున్నాయి. కొత్తగా మూడు కాంప్లెక్స్‌ల్లో 23 మరుగుదొడ్లు నిర్మించారు. ఎల్లారెడ్డిలో పాతవి 8 ఉండగా కొత్తగా 12 మరుగుదొడ్లను 2 కాంప్లెక్స్‌లలో కట్టా రు. బాన్సువాడలో మూడు కాంప్లెక్స్‌ల్లో 17 మరుగు దొడ్లు ఉండగా కొత్తగా 3 కాంప్లెక్స్‌లను జనాభా అవసరాలకు తగ్గట్లుగా నిర్మించారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు చాలా మేరకు జనాల అవసరాలకు తగ్గట్లుగా సరిపోవడం లేదు. మరోవైపు పాత నిర్మాణాల్లో అనేకం వినియోగంలో లేకపోవడం, నిర్వహణ కరువవ్వడంతో ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో పాతవి మనుగడలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి.
అత్యవసరాలను తీర్చుకోవడంలో పురుషులతో పోలిస్తే మహిళలే తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. ఇల్లు వదిలి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే చాలా మంది స్త్రీ మూర్తులకు నిత్యం ఈ సమస్య నరకప్రాయంగా మారిం ది. తమ సమస్యను చెప్పుకోలేక సతమతం అవుతూ ఊపి రి బిగబట్టుకొని ఇంటికి చేరేదాకా ఉండాల్సిన దుస్థితి ఎం దరికో అనుభవం. ఇలాంటి కడు దయనీయైన పరిస్థితిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టిం ది. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మూత్రశాలలు, మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. పట్టణ ప్రగతి ప్రారంభంలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని అత్యవసర పనిగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్లను నిర్మించాలని నిర్ణయించడంతో మున్సిపాలిటీ వారీగా పనులు పూర్తికాగా ప్రస్తుతం జనాలకు అందుబాటులోకి వచ్చేశాయి.
గతంలో భీమ్‌గల్ పట్టణానికి వచ్చేవారు పబ్లిక్ టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా మహిళలు చెప్పుకోలేని ఇబ్బంది ఉండేది. భీమ్‌గల్ మున్సిపల్‌గా మారడంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ చొరవతో పబ్లిక్ టాయిలెట్ల బాధ తీరింది.
– కన్నె ప్రేమలత, మున్సిపల్ చైర్పర్సన్, భీమ్‌గల్