కామారెడ్డి, ఆగస్టు 5 : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రాజెక్టులో 86 పిల్లర్లు ఉంటే కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగి పోతే కాళేశ్వరం మొత్తం కూలిందని దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలను తొలగించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షించేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయగా..
గంప గోవర్ధన్‌తోపాటు ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, భిక్కనూర్, పాల్వంచ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, హరీశ్‌రావును బద్నాం చేయాలని, బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా కనుమరుగు చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తూ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ద్వారా స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాడుతాం..
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఎన్ని అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ సర్కార్ కేవలం కాలయాపన చే యడానికి ఢిల్లీకి కమీషన్లు మోసుకెళ్తూ బీఆర్ఎస్ను బద్నాం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు కలిసి కట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజాసమస్యలపై పోరాడుతామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల మన్ననలు పొంది మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ బాలమణి, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, కామారెడ్డి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు బల్వంత్ రా వు, గైని శ్రీనివాస్ గౌడ్, గరిగంటి లక్ష్మీనారాయణ, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.