EX MLA Jeevan Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 8 : ఓట్ల కోసం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల నెత్తిపై కత్తి పెట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్దేశ్య పూర్వకంగానే యూరియా కొరత సృష్టించి అన్నదాత మెడకు ఉరి బిగించిందని ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం క్యూలు కడుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయని ఆయన పేర్కొంటూ అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఎరువుల కొరతతో సగానికి సగం పంటల దిగుబడి తగ్గుతుందని రైతుల గగ్గోలు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో ఎరువుల దుకాణాల వద్ద ఎప్పుడైనా పోలీసులు కనిపించారా అని గుర్తుచేశారు. ఎరువుల బస్తాల కోసం రైతులను లైన్లో నిలుచోబెట్టి పాత రోజులను కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పొద్దున 5 గంటలకే ఎరువుల కేంద్రాల వద్దకు రైతులు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యూరియా కొరత సమస్య దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, అది కేవలం తెలంగాణలోనే ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేదని, రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించామని ఆయన గుర్తు చేశారు. వాళ్ల పార్టీ మంత్రులే యూరియా లేదటుంటే, రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెపుతున్నారని ఆయన విమర్శించారు. రోజుల తరబడి లైన్లో నిలబడ్డ రైతులు, మహిళలు కడుపుమండి బూతులు తిడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వినబడట్లేదా అని ఆయన నిలదీశారు. కేసీఆర్ ను, కేటీఆర్ ను తిట్టుడు తప్ప కాంగ్రెస్ కు వేరే పనేలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎట్లుంది?, నేడు ఎట్లుంది? అని ఆయన అన్నారు. స్వర్ణ యుగం పోయి మళ్లీ రాతి యుగం వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముష్కర పాలనపై కడవరకూ పోరాడుతామని, తెలంగాణ రైతుల పక్షాన ఎంతకైనా తెగిస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.