నిజామాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మాయ మాటలు, తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కొనసాగిందని ప్రజలంతా మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా నిధుల కేటాయింపు ఉందని అంటున్నారు. సభా వేదికలపై నిత్యం బూతులు వల్లించే సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలకు వరాలు ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తం రూ.3,24,234కోట్లు బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రసంగంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వెలుగు చూస్తోంది. ఆరు గ్యారంటీల అమలుపై కప్పదాటు వ్యవహారం మాదిరిగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించిందని జనాలంతా నిట్టూరుస్తున్నారు. మహిళలకు రూ.2500 సాయం, పింఛన్ పెంపు, యువతులకు స్కూటీలు, నిరుద్యోగు భృతి, 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. జాబ్ క్యాలెండర్ పేరిట హడావిడి చేసినప్పటికీ బడ్జెట్లో ఊసే ఎత్తలేదు. నిధుల కేటాయింపుల్లో అనేక రంగాలకు సమతుల్యత లోపించింది. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు మొండి చేయి చూపించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరాలు అందిస్తారని అంతా ఆశించగా భంగపాటు దక్కింది. గత బడ్జెట్లో ప్రస్తావించిన షుగర్ ఫ్యాక్టీ అంశా న్ని అటకెక్కించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని గతంలో ప్రకటన చేసిన భట్టి విక్రమార్క హామీకి ఈ బడ్జెట్లో అతీగతీ దక్కలేదు.
బీసీలకు వరుసగా మూడో వార్షిక బడ్జెట్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేసింది. బీసీలకు ఇస్తామని చెప్పిన అనేక హామీలను విస్మరించింది. బడ్జెట్ ప్రసంగంలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయింపులు తూతూ మంత్రంగానే ఉన్నాయి. బీసీ డిక్లరేషన్‌లో ప్రస్తావించిన అంశాలను ఆర్థిక మంత్రి పట్టించుకోలేదు. 42శాతం రిజర్వేషన్లను గాలికి వదిలేశారు. బీసీ కులాలకు అనేక హామీలు గుప్పించి ప్రస్తుతం మౌనంగా ఉండి పోయింది. బీసీ విద్యార్థులకు రాయితీలు, చదువుకు ప్రోత్సాహకాలు వంటి వాగ్ధానాలు మరిచి పోయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాన్ని భట్టి పట్టించుకున్నట్లే కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు పథకాన్ని తీసుకు రాకపోవడంపై మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను విస్మరించడంపై దుమ్మెత్తి పోస్తున్నారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు పాతరేసినట్లుగానే బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వ మంగళం పాడింది.
బాన్సువాడ, మార్చి 20: హామీలను నమ్మి రైతులు ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారిని విస్మరించింది. రైతుబంధు ఎగ్గొట్టింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. యూరియా సరిపడా ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఉత్తుత్తి మాటలు చెప్పికాలం గడుపుతున్నారు. ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.
– దుద్దాల అంజిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్
కామారెడ్డి, మార్చి 20: విద్యారంగంపై పాలకుల మాటలన్నీ నీటి మూటలే అని తేల్చిన తెలంగాణ బడ్జెట్. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది 8.2 శాతం మాత్రమే. తెలంగాణ విద్యా కమిషనర్ సూచించినట్లు 18 శాతం కానీ, కనీసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పినట్లు 15 శాతమైనా బడ్జెట్లో ప్రకటించక పోవడం ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనం.
– చకినాల అనిల్ కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రైతన్నలకు మరోసారి కాంగ్రె స్ ప్రభుత్వం మోసం చేసిం ది. రైతుభరోసా, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ రూ.500 వర్తిం పు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేటాయిం పులు గతంలో మాదిరిగానే చేసినప్పటికీ అమలు విషయంలో రైతులకు భరోసా ఇవ్వ లే దు. 2025-26 బడ్జెట్లోనూ కేటాయింపులు జరిపినప్పటికీ గత యాసంగి బోనస్ ఎగ్గొట్టారు. రైతు భరోసాను సరిగా అమలు చేయలేదు. రుణమాఫీ సగం మందికే అమలు చేసి చేతులు ఎత్తేశారు. ఈ దుస్థితిలో 2026-27లో కేటాయింపులు జరిపినట్లుగా భట్టి విక్రమార్క చెబుతున్నప్పటికీ అమలు విషయంలో రైతులకు నమ్మకం లేకుండా పోయింది. వార్షిక బడ్జెట్లో అసత్యాలు, అవాస్తవాలను క్రోడీకరించారు. భట్టి విక్రమార్క ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. నిస్సిగ్గుగా అమలు చేయని పథకాలను చేసినట్లుగా చెప్పుకోవడం ఆర్థిక మంత్రికే చెల్లింది. రుణమాఫీ సంపూర్ణంగా చేసినట్లుగా ఆర్థిక మంత్రి చెప్పడంపై రైతులు నవ్వుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.70లక్షల మందికి రుణమాఫీ వర్తించలేదు. రైతుభరోసా ఎకరానికి ఏటా రూ.15వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పగా రూ.12వేలు అమలు చేసేందుకే సిద్ధమైనట్లుగా భట్టి ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ఇందులో రూ.3వేలు కోతను కొత్త బడ్జెట్లోనూ కొనసాగిస్తున్నారు. రెండు సీజన్లకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందజేతపై క్లారిటీ ఇవ్వలేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కుదేలైంది. నిత్యం అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం నెట్టుకొస్తుండగా సామాన్య జనాల పాలిట శాపంగా ప్రజాపాలన మారింది. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా తెలంగాణ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. రియల్ ఎస్టేట్ రంగమైతే పైకి లేవడమే గగనమైంది. రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టిన వారంతా నిట్టూరుస్తున్నారు. నష్టాలు మూట గట్టుకుని ఆత్మహత్యలు చేసుకునే దౌర్భగ్యకరమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండున్నరేళ్లుగా ఉద్యోగ కల్పన కరువైంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా జనాల చేతిలో నగదు లేక కొనుగోలు శక్తి పడిపోతోంది. ఈ దుస్థితిలో సామాన్యుల తలసరి ఆదాయం ఘోరంగా డౌన్ ఫాల్ అవుతుండగా బడ్జెట్లో సర్కారు మాత్రం రూ.4.18లక్షలుగా చూపడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. తలసరి ఆదాయం లెక్కింపులోనూ శాస్త్రీయత లోపించదన్న విమర్శలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా గత కేసీఆర్ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తీసుకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో అమలు చేసే మెనూను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు మేలు చేకూర్చింది. 2023, డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతో కుట్రలకు పాల్పడింది. అర్ధాంతరంగా ఈ పథకానికి బ్రేక్ వేసి పేద పిల్లల ఉసురు తీసుకుంది. వారి అర్ధాకలికి కారణంగా నిలిచింది. 2026-27 వార్షిక బడ్జెట్లో తిరిగి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొంది. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా విజయవంతంగా అమలైన పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి సర్కార్‌కు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పథకాలకే పేర్లు మార్చుకుంటూ తిరిగి పునఃప్రారంభించాల్సిన గత్యంతరం ఏర్పడింది. బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రద్దు చేయడం వల్ల రెండున్నరేళ్లుగా పేద విద్యార్థులంతా అద్భుతమైన సౌకర్యాన్ని రేవంత్ రెడ్డి మూలంగా కోల్పోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ సర్కారు పేదలకు మొండిచేయి చూపింది. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంకెల గారడి బడ్జెట్ తప్ప, అందులో ఏం లేదు. రాజీవ్ యువశక్తి పథకం కింద యువతను ఆదుకుంటామన్నారు. ఆ ఊసే లేదు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించలేదు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలనూ కాంగ్రెస్ మోసం చేసింది.
– షేక్ జుబేర్, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
వినాయకనగర్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్ని రంగాలను విస్మరించింది. ఈసారి కూడా అంకెల గారడీ ప్రదర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలం గడుపుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో పెన్షన్ల పెంపు మాటే లేదు. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్సీ కోసం నిధులు కేటాయించలేదు. రెండేళ్లుగా సీడీపీ కింద రావాల్సిన నిధులే ఇవ్వలేదు. ఇక ఆరు గ్యారెంటీలకు నిధులిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు?
– ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అర్బన్ ఎమ్మెల్యే
బోధన్, మార్చి 20: అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై బడ్జెట్లో ఎలాంటి స్పష్టత లేదు. హామీల అమలుపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. కాకి లెక్కలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎటువంటి ప్రతిపాదనలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు తులం బంగారం ఇస్తామన్న హామీని అధికారంలోకి వచ్చిన రెండేండ్ల తర్వాత కూడా ఈ బడ్జెట్లో నెరవేర్చకపోవడం శోచనీయం.. నిరుద్యోగులకు భృతి, కూలీలు, మహిళలకు ఇస్తామన్న హామీలను మర్చిపోయారు.
– మహ్మద్ షకీల్, బోధన్ మాజీ ఎమ్మెల్యే
వార్షిక బడ్జెట్ 2026-27లో తులం బంగారం హామీ గల్లంతైంది. భట్టి విక్రమార్క ప్రసంగ పాఠంలో ఎక్కడా ఈ హామీని ప్రస్తావించలేదు. అధికారంలోకి వచ్చేందుకు ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.1లక్షతో పాటుగా తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. కానిప్పుడు మూడు వరుసగ బడ్జెట్లోనూ తులం బంగారం హామీ పత్తా లేకుండా పోయింది. పేద ప్రజల బడ్జెట్ అంటూ భారీ ప్రకటనలు వల్లిస్తోన్న కాంగ్రెస్ నేతలంతా తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడం లేదు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నప్పటికీ ఈ హామీని ఎగవేతకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పకడ్భందీగా అమలైంది. అర్హులైన వారందరికీ ఆడబిడ్డల పెళ్లికి సాయం అందేది. కానిప్పుడు సమయానికి చెక్కులు అందకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళంలో పడేస్తోంది.
ఖలీల్‌వాడి, మార్చి 20: అబద్ధాలు, అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేయని గ్యారెంటీలు అర డజన్.. నమ్మి ఓట్లేసిన జనాన్ని ముంచుడే కాంగ్రెస్ విజన్ అని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క వట్టి మాటలు ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారన్నారు. ఈ రెండేండ్లలో దివ్యాంగులకు రూ.54 వేలు, ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు బాకీ పడ్డారని, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఊసే లేదని ఆయన విమర్శించారు. బడ్జెట్లో స్కీమ్‌లకు ఘోరీ కట్టి, స్కామ్‌లకు తెర లేపారని ఆరోపించారు. దళితులకు కేటాయించే బడ్జెట్ ను కుదించారని, బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాశారన్నారు.