మోర్తాడ్/వేల్పూర్/ఏర్గట్ల, జూలై 17 : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కాంగ్రెస్ నాయకుడు ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు.
ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ గూండాలు ఈ విధంగా దాడులకు పాల్పడడం మంచిది కాదన్నారు. మరోవైపు, ఈ దాడులతో తన నోరు మూయలేరని వేముల స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తన బాధ్యత అని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.
వేల్పూర్‌లో టెన్షన్.. టెన్షన్
బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర సవాళ్ల నేపథ్యంలో గురువారం వేల్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలకు యత్నించడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లోకి కాంగ్రెస్ నేత చొరబడి విధ్వంసం సృష్టించగా, కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చేందుకు యత్నించడం కలకలం రేపింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులతో నిరసన తెలుపగా పోలీసులు అడ్డుకున్నారు.
వేల్పూర్‌లోని గాంధీ విగ్రహం వద్ద హైడ్రామా చోటు చేసుకున్నది. కాంగ్రెస్ నాయకులు ఉదయం నుంచే వేల్పూర్‌కు వచ్చి షాపులు, సందుల్లో దాక్కున్నారు. వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కొందరు బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహం వద్దకు వచ్చి దొంగల పాలన, దోపిడీ పాలన అని నినాదాలు చేయగా, వారిని కూడా అరెస్ట్ చేశారు. 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ విగ్రహం వైపు రాగా, పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం, తోపులాట జరిగింది.
కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలి
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రశాంత్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడుల్ని ఆపకుంటే బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గూండాలను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వేముల ఇంటిపై దాడి చేసిన వారిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదేనా మొహబ్బత్ కీ దుకాన్
గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే ఇండ్లపై దాడులు చేస్తారా..? ఇదే నా రాహుల్‌గాంధీ చెబుతున్న మొహబ్బత్‌కీ దుకాన్? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పిలుపునిచ్చి మరీ ప్రతిపక్ష నాయకుల ఇండ్లపై దాడులు చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడి పిలుపుతో జరిగిన ఈదాడిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి హంగామా ..!
గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ నేతలు.. వేముల ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. అంతమంది పోలీసులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన గల్ఫ్ ఫోరం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డాడు. పై అంతస్తులోకి వెళ్లి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి యత్నించడం కలకలం రేపింది.
ఇది గమనించిన బీఆర్ఎస్ నాయకులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేస్తుంటే, అంత మంది పోలీసులు ఉండి ఏం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ, ఎస్సైలు, 120 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల్పూర్‌కు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. అయినప్పటికీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు వేల్పూర్లోకి ఎలా వచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రశ్నిస్తే ఇళ్లపైకి దాడికొస్తారా?
మోర్తాడ్/వేల్పూర్, జూలై 17: అధికార పార్టీ వైఫల్యాలపై ప్రశ్నించినందుకు ఇళ్లపై దాడి చేస్తారా..? ఇలా దాడులు చేయడం వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్న ఆయన.. అధికార పార్టీ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఇలా దాడులు చేసుకుంటూ పోతారా? అని ఓ ప్రకటనలో నిలదీశారు. ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించా. దీనికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మా ఇంటి మీదికొస్తానని సవాల్ విసిరిండు. ఇవాళ మా ఇంటి మీదకు కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేశారు. మానాల మోహన్‌రెడ్డికి ఇప్పుడు కడుపు సల్లబడిందా?’ అని ప్రశ్నించారు.
దాడి వల్ల లాభమేముంది?
తన ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకి జరిగే లాభం ఏమిటని వేముల నిలదీశారు. గత పదేండ్లలో కేసీఆర్‌తో పాటు తనను ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్నో మాటలు అన్నారని గుర్తు చేసిన వేముల.. మీరు చేసినట్లు మేము ఇండ్ల మీదికి పోయినామా?..ఇది సభ్యతనా? రాజకీయాల్లో ఇది మంచిదా? అని ప్రశ్నించారు. ఇంటిపై దాడికి రావడమో, రాజకీయ సన్యాసం తీసుకోవడమో ఇలాంటివి టైం పాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప దీంతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు.
ప్రశ్నించడం ప్రజలు ఇచ్చిన హక్కు..
అధికార పార్టీ వైఫల్యాలపై ప్రశ్నించడం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన బాధ్యత అని, ప్రజలు తనకు ఆ హక్కు ఇచ్చారని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మీరు చేయాల్సింది నా ఇంటిపై దాడి కాదు. ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడండని మానాల మోహన్‌రెడ్డికి హితవు పలికారు. బాల్కొండ నియోజకవర్గంలో 50 వేల మంది రైతులుంటే, 20 వేల మందికే రుణమాఫీ అయిందని, ఇంకా 30వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. ఇలా ఎన్నో పెండింగ్‌లో ఉన్న హామీలపై ముఖ్యమంత్రిని ఒప్పించి అమలు చేసే పని చేయండి. అంతే కానీ నా ఇంటి మీదకు దాడికి వస్తే ప్రజలకు జరిగే మేలేమి లేదని స్పష్టం చేశారు.
వరంగల్ నుంచి ఎందుకొచ్చారు..
కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ఎన్ఆర్ఐ ఫోరమ్ అధ్యక్షుడు, వరంగల్‌కు చెందిన దేవేందర్‌రెడ్డి తన ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులపై దాడికి యత్నించాడని వేముల తెలిపారు. వరంగల్ నుంచి వచ్చి నా ఇంట్లో హంగామా చేయడం ఎంతవరకు సమంజసమని వేముల ప్రశ్నించారు. మానాల మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అతడు గూండాలను వెంట బెట్టుకొని దాడికి వచ్చారన్నారు. నా ఇంట్లోకి చొరబడి నా సోదరుడిపై దాడి చేయడమే కాకుండా, ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ గోల చేయడంతో
పోలీసులు అతన్ని బయటికి తీసుకొచ్చారని తెలిపారు.