నిజామాబాద్, జనవరి 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో మొత్తం 420 హామీలు ఇచ్చింది. రెండేళ్లలో పాక్షికంగా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అరకొరగా రైతు భరోసా, సగం మందికే రైతు రుణమాఫీ మినహా మిగిలిన పథకాలు అసంపూర్తిగానే మిగిలి పోయాయి. హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్ధానాల అమలుకై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులతో పాటుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిలదీస్తున్నారు.
గుక్క తిప్పుకోకుండా కాంగ్రెస్ సర్కార్‌ను అష్ట దిగ్భంధనంలో చుట్టేయడంతో రేవంత్ రెడ్డి తట్టుకోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీవీ సీరియల్ ఎపిసోడ్ మాదిరిగానే పసలేని ఆరోపణలతో క్యారెక్టర్లను దెబ్బతీసేందుకు కేసుల విచారణ పేరుతో టైం పాస్ చేస్తున్నారని జనాలంతా అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో స్వల్ప మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా అర్థం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి పసలేని ఆరోపణలతో హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టినట్లుగా జనాలు గుర్తు చేసుకుంటున్నారు.
ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కూడా ఇలాంటి డ్రామాలు రక్తికట్టించారన్న విమర్శలు ఉన్నాయి. పురపాలక ఎన్నికలు ముందు మరో నాటకంతో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలనే కుట్రలను సబ్బండ వర్గాలు గుర్తించాయి. రెండేళ్లుగా హామీల అమలును గాలికి వదిలేసి ప్రతిపక్ష బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం అనైతికమని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ మోనం వహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతిని ఎండగట్టడంలో కమలం పార్టీ నోరు మెదపకపోవడంపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
కుంభకోణాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ సర్కార్
– వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి
రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుంది. సివిల్ సైప్లెస్, లిక్కర్, బొగ్గు కుంభకోణాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి బహిరంగంగానే వాటాల కోసం తన్నుకుంటున్నారు. మంత్రుల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి పట్టుకుని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డికి ఉంది. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నాడు. రేవంత్ అవినీతిపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో పబ్బం గడుపుతున్నాడు.
దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం…
– బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే
అవకాశవాద, అవినీతికర, దగాకోరు ప్రభుత్వానికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నాడు. తెలంగాణ సాధించిన ఉద్యమ యోధులపై, ఉద్యమ పార్టీపై ఆంధ్రా శక్తులతో చేతులు కలిపి కుట్రలకు పాల్పడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డి చేష్టలను, అవినీతి వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అరాచకాలను సాగనిచ్చేది లేదు. ప్రభుత్వ బలగాలను ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీపై వినియోగించినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకడుగు వేసేది లేదు. ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు పోరాటం తప్పక చేస్తాం.
బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలు..
– గంప గోవర్ధన్, మాజీ ప్రభుత్వ విప్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చిందేమీ లేదు. కేసీఆర్ హయాం లో జరిగిన అభివృద్ధిని చూపి స్తూ తన గొప్పతనంగా చెప్పుకుంటున్నాడు. పైసా నిధులివ్వడం లేదు. తెలంగాణ ప్రజల సొమ్మును వక్రమార్గంలో దోపిడీ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అవినీతి బండారాన్ని బయట పెట్టడంతోనే కేటీఆర్, హరీశ్ రావులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. న్యాయస్థానాల్లో నిలవని కేసులను పట్టుకుని సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా సాగదీస్తూ క్యారెక్టర్‌ను దెబ్బతీయాలనే కుట్రలకు పాల్పడుతున్నాడు. రేవంత్ రెడ్డి డ్రామాలను ప్రజలంతా గ్రహించారు. సరైన సమయంలో సమాధానం ఇచ్చేందుకు జనాలంతా రెడీగా ఉన్నారు.
ప్రజాపాలన కాదు..రాక్షస పాలన..
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లుగా రాక్షస పాలన కొనసాగుతోంది. ప్రజాపాలన అని గొప్పగా పేరు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అసంబద్ధమైన హామీలు ఇచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మోసగించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూటకో మాట చెబుతూ కాలం గడుపుతున్నాడు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిలదీస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర కీలక నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠాన్ని ప్రజలు త్వరలోనే చెబుతారు.
ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు..
-అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరు. కేసీఆర్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలియదా? కేసులు పెడితే భయపడుతాం అనుకుంటున్నారా.. ఎన్ని కేసు లు పెట్టినా, చిత్రహింసలకు గురిచేసినా తట్టుకొని ముందకెళ్తామే తప్పా, మీ మంత్రుల మాదిరిగా అవినీతికి పాల్పడబోం. ఇదే ధోరణితో ముందుకెళ్తే ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారు. ప్రభుత్వం బాధ్యతతో చేయాల్సిన పనులు చేయక, ప్రజాస్వామ్య విలువలను తీస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఇకనైనా కాంగ్రెస్ బుద్ధిమార్చుకోవాలి.