బిచ్కుంద, నవంబర్ 21: కాంతారావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎనిమిది మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్కు తరలివెళ్లి, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా వలస వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ను బలహీనపరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు అంటగడుతున్నారని విమర్శించారు. లక్ష్మీకాంతారావు మారకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పీసీసీ పెద్దలకు కాంగ్రెస్ నేతలు సౌదాగర్ అరవింద్, జయ ప్రదీప్, కమల్ కిశోర్, వినోద్, సంగమేశ్వర్ తదితరులు ఫిర్యాదు చేశారు.