Bodhan | శక్కర్ నగర్ : ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో స్పష్టమైన మార్పు మొదలైందని, ఇకపై ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులకు ప్రజలు చుక్కలు చూపిస్థారని అన్నారు. ఇదే స్ఫూర్తి తో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బోధన్ నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థులు, బీజేపీ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్ లకు మేడపాటి ప్రకాష్ రెడ్డి శాలువాలు సన్మానించారు.
సర్పంచ్ లతో పాటు ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షుడు పసులోటి గోపి కిషన్, ఎడపల్లి మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, సాలూర మండల అధ్యక్షుడు గంగాధర్, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.