సారంగాపూర్, మార్చి 17: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా విస్మరించిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ వంచించేలా ఉందని మండిపడ్డారు. నిజామాబాద్‌లోని తన నివాసంలో ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్‌నాయక్, యువజన అధ్యక్షుడు ఇందల్నాయక్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శనివారం బాజిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాల హామీలను కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. ప్రధానంగా రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు పర్చే బాధ్యతను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రజా, రైతు సంక్షేమాలను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిన్నారు. ఇప్పటికీ అసెంబ్లీ సాక్షిగా సీఎంతో పాటు మంత్రులు కూడా అబద్ధాలు వల్లే వేస్తూ అన్ని వర్గాలనూ మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ రెండున్నరేళ్ల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకతను మూట గట్టుకుందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు, యూరియా కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తమకేమి పట్టనట్లుగా ఉండటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ భూస్థాపితం కావడం, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బంజారా సేవా సంఘం ప్రతినిధులు శంకర్‌నాయక్, బానోత్ గోపాల్‌నాయక్, శ్రీరాంనాయక్, రాథోడ్ అనిల్, శివరాం ఉన్నారు.