నాగిరెడ్డిపేట, నవంబర్ 16: అందమైన చెట్లు.. అరుదైన పండ్ల మొక్కలతో ఉమ్మడి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నది. రేవంత్ సర్కారు ఒక్క రూపాయీ కూడా విదల్చక పోవడంతో పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్నది. బోధన్-హైదరాబాద్ రహదారిని ఆనుకుని 61 ఎకరాల్లో విస్తరించిన ఉద్యాన క్షేత్రంపై పర్యవేక్షణ లేకపోవడంతో రూ.కోట్ల విలువ చేసే యంత్రాలు, మిస్ట్ చాంబర్లు, ట్రాక్టర్లు తుప్పు పడుతున్నాయి. అరుదైన పండ్ల తోటలు, ఉసిరి, దానిమ్మ, ఆపిల్‌బేర్, కరివేపాకు తోటల్లో పిచ్చి మొక్కలు పెరిగి ఆనవాళ్లు లేకుండా పోయాయి. అంటుమొక్కల కోసం వేసిన గ్రీన్షెడ్ నెట్లు చిరిగి పోయి వేలాడుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం మాల్తుమ్మెద క్షేత్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది. 2016లో రూ.1.36 కోట్లు మంజూరు చేసి అన్ని వసతులు కల్పించింది. నూతన గదులు, గ్రీన్షెడ్ నెట్లు, మిస్ట్ చాంబర్, ట్రాక్టర్లు, యంత్రాల కొనుగోలుతో పాటు నూతన తోటలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పండ్ల మొక్కల పెంపకంపై ఇక్కడ శిక్షణను సైతం ఇప్పించారు. ప్రభుత్వం మారడంతో ఉద్యాన క్షేత్రం నిర్లక్ష్యానికి గురైంది. నేడు ఆలనాపాలన లేక అంధకారంలోకి చేరుకున్నది. ఈ ఏడు ఒక్క మొక్క కూడా ఉత్పత్తి చేయలేదు. కనీసం అక్కడి గడ్డిని కూడా తొలగించలేదు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన గ్రీన్షెడ్ నెట్లు, మిస్ట్ చాంబర్ వృథాగా మారాయి. వాటిని వినియోగించక పోవడంతో శిథిలావస్థకు చేరాయి. క్షేత్రంలోని పండ్ల తోటలు, అంటు మొక్కల కోసం తెచ్చిన ఎరువులు 5 నెలలుగా అక్కడి గదుల్లోనే మూలుగుతున్నాయి. సకాలంలో వాటిని వినియోగించకపోవడంతో అవి వృథాగా మారుతున్నాయి.
నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద శివారులో 40 ఏండ్ల క్రితం ఉద్యాన వనక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. మామిడి సహా ఇతర పండ్ల తోటల పెంపకంతో పాటు అంటు మొక్కల ఉత్పత్తిలో ఈ క్షేత్రం ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ ఒక ఏడీఏ, ఇద్దరు ఉద్యాన అధికారులు (హెచ్‌వో), ఇతర సిబ్బంది కలిపి 12 మంది వరకు పని చేసే వారు. నిత్యం 100 మందికి పైగా కూలీలతో అంటు మొక్కల ఉత్పత్తి జరిగేది. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరేవారు ఆంటే ఇక్కడ ఏ స్థాయిలో ఆహ్లాదంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఒకనాడు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద క్షేత్రం సర్కారు నిర్లక్ష్యంతో ప్రస్తుతం కళావిహీనంగా మారింది. పట్టించుకునే వారు లేకపోవడంతో అరుదైన పండ్లతోటలు కనుమరుగవుతున్నాయి. ఇక్కడ 30 ఎకరాల్లో పాత మామిడితోట ఉండగా, రెండేండ్ల క్రితం మరో ఐదెకరాల్లో అరుదైన మామిడి తోటలను సాగుచేశారు. ఎకరం విస్తీర్ణంలో పాత జామ తోట ఉండగా, మరో ఐదెకరాల్లో తైవాన్‌జామ, ఇంకో ఐదెకరాల్లో లక్నో 49 రకం నాటారు. రెండెకరాల్లో ఉసిరి తోట, ఆయిల్ఫామ్ నాటారు. నాలుగు ఎకరాల్లో ఆపిల్‌బేర్ ఉండగా, రెండు ఎకరాలను తొలగించి మామిడితోటగా మార్చారు. నాలుగు ఎకరాల్లో దానిమ్మ సాగుచేయగా పర్యవేక్షణ లేక ఎండిపోయింది. వీటితో పాటు సర్వ్ చెట్లు, కరివేపాకు తోట, అల్లనేరేడు, టేకు చెట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ ఆలనాపాలన లేక అవసాన దశకు చేరాయి.
అధికారుల పర్యవేక్షణ లేక ఉద్యాన క్షేత్రం అడవిగా మారింది. పచ్చని తోటల నడుమ అందమైన దారులతో కనువిందు చేసిన ఈ క్షేత్రం ఇప్పుడు గడ్డి, పిచ్చి మొక్కలతో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితికి చేరింది. ఆర్నెళ్లుగా పని చేసే వారు లేక, పట్టించుకునే వారు లేక రూ.కోట్ల విలువైన యంత్రాలు, ట్రాక్టర్లు, యంత్రాలు, సామగ్రి తుప్పు పడుతున్నాయి. సిబ్బందికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కేసీఆర్ హయాంలో 2017లో రూ. 16 లక్షలతో 10 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ లేక ఒక్కటి కూడా పనిచేయడం లేదు.
ఇక్కడ ఉద్యాన అధికారిగా పని చేసిన రామకృష్ణ మూడు నెలల క్రితం కామారెడ్డికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన కమలాకర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లా కేంద్రంలోనే ఉంటూ ఏదో చేసుకుని ఉద్యోగోన్నతిపై కరీంనగర్‌కు వెళ్లిపోయారు. దీంతో సదాశివనగర్ హెచ్‌వో హర్షవర్ధన్‌కు మాల్తుమ్మెద ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా ఇటువైపు రావడం లేదు. అధికారులు, సిబ్బంది లేక పర్యవేక్షణ కరువైంది. ఇక్కడ దినసరి కూలీలుగా పని చేస్తున్న రాంచందర్, నవీన్‌లే ఉద్యాన క్షేత్రానికి పెద్దదిక్కుగా మారారు.
ఇక్కడ పని చేసిన హెచ్‌వో కమలాకర్ బదిలీపై వెళ్లడంతో ఇటీవలే నాకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఏడాది కాలంగా క్షేత్రానికి నిధులు రాలేదు. దీంతో ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టలేక పోతున్నాం. నిధులు వస్తే పనులు మొదలెడతాం.
– హర్షవర్ధన్, ఇన్చార్జి హెచ్‌వో, మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం