ఖలీల్‌వాడి, జూన్ 25 : రాష్ట్రంలో రేవంత్ పాలన 50 ఏండ్ల నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది గోల్డెన్ పీరియడ్ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు పంగనామాలు, 420 హామీల ఎగనామాలు పెట్టి ప్రజలను నిలువునా ముంచిన దగాకోరు పార్టీ కాంగ్రెస్ అని ఘాటుగా విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు మోసాలపై ప్రశ్నించే వారిపై బూటకపు కేసులు, అక్రమ నిర్బంధాలు విధిస్తూ, నాటి నిరంకుశ ఎమర్జెన్సీ రోజులను జ్ఞప్తికి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ది కేడీలు, బేడీల పాలనగా ఆయన అభివర్ణించారు. రేవంత్‌రెడ్డికి విశ్వవిఖ్యాత బూతుల రత్న అని, గోబెల్స్ ప్రచారం చేయడంలో నోబుల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను, ఆయన ఫ్యామిలీని తిట్టందే రేవంత్‌కు పూట కూడా గడవదని పేర్కొన్నారు. రైతు పండుగ పేరుతో అసలు రైతులే లేని దండగమారి సభలో కేసీఆర్ పదేండ్ల పాలనపై రేవంత్‌రెడ్డి విషం కక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్, కేటీఆర్‌ను దూషించారని, తెలంగాణ ప్రాజెక్టులను అవమానించారని మండిపడ్డారు.
తన గురువు చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో రేవంత్‌రెడ్డి తెలంగాణ విద్రోహ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సమాధి కట్టి తెలంగాణను ఎండబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏం ఒరగబెట్టారని రైతు విజయోత్సవ సభలు జరుపుతున్నారని ఆయన నిలదీశారు.
రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసాకు తూట్లు పొడవడం, పంట బోనస్ ఎగ్గొట్టడం వంటి చర్యలతో నిత్యం అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పండుగ చేసుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు స్వర్ణయుగమంటే కేసీఆర్ పదేండ్ల పాలన అని, రాతియుగమంటే కాంగ్రెస్ కటిక చీకటి పాలన అని పేర్కొన్నారు. కేసీఆర్‌పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలను ప్రజలు గ్రహిస్తున్నారని, కాంగ్రెస్‌ను తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.