నిజామాబాద్, సెప్టెంబర్ 01, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నీళ్లు, నిరంతర కరెంట్, ఉద్యోగ నియామకాలు, మౌళిక సదుపాయాల కల్పనకు గతంలో కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రణాళికబద్ధంగా పరిపాలన చేసి దేశంలోనే తెలంగాణకు అత్యుత్తమ గుర్తింపును కులమతాల వైషమ్యాలు లేకుండా ప్రజా పాలన సాగిస్తూ కేసీఆర్ హయాంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ నిలిపారు. ఇదే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కన్ను కుట్టేలా చేసింది.
2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి అలుపెరగని పోరాటాలు చేసి, కేంద్రంలో అనేక పార్టీలను ఒప్పించి, తెలంగాణ ఆవశ్యకతను వివరించి, పార్లమెంట్లో బిల్లు పెట్టించి మరీ ప్రత్యేక తెలంగాణకు ఊపిరి పోసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఒక పీడకలగా ఉంటే 2014 తర్వాత రైతులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టిన సాధకుడు కేసీఆర్ మాత్రమే. అలాంటి రాష్ట్ర సాధకుడిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిత్యం బురద రాజకీయాలు చేస్తూ పైశాచికత్వాన్ని పొందుతోంది. ఘోష్ కమిషన్ నివేదిక పేరుతో చేస్తోన్న అలజడి అందులో భాగమే.
కాళేశ్వరం లాంటి బహుళార్ధసాధక ప్రాజెక్టును కర్కషంగా పక్కకు నెట్టి రైతుల పొలాలను ఎండబెట్టి 20 నెలలుగా కాంగ్రెస్ సర్కారు దమనకాండను సాగిస్తోంది. ప్రజల్లో అనుమానాలు పెంచి పోషించి, అసత్య ప్రచారాలతో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపులో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగనున్నాయి. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వంద నీతిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టును కుట్ర పూరితంగా వాడకంలోకి తీసుకు రాకుండా చేస్తున్నారు. మరోవైపు నిర్జీవ ప్రాజెక్టు అంటూ నిందలు వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో కేసీఆర్ నిర్మించిన ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న పంప్ హౌస్‌లోని మోటార్లను నడిపించి నీళ్లను ఎత్తిపోస్తున్నారు.
ఇలా నోటికి ఎంత వస్తే అంతా అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోడుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ చోటా మోటా లీడర్లు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలేవి అంటూ మండిపడుతున్నారు. ప్రజలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేక ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లుగా ప్రజలంతా గమనించారు.
20 నెలల నుంచి రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడానికే రేవంత్ రెడ్డి సర్కారు పాకులాడుతుండటంపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు సైతం తప్పు బడుతున్నారు. బీఆర్ఎస్ను నిందలు వేస్తూ పూట గడపడమే పనిగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ పార్టీని బద్ధ శత్రువుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నప్పటికీ తెలంగాణలో అలాంటిదేమీ లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. పరస్పర అంగీకారంతో రాజకీయం చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అన్నట్లుగా కుటిల నీతికి పాల్పడుతున్నట్లుగా ప్రజలు అనుమానిస్తున్నారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 2న(నేడు) సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారి ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా వెల్లడైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఓటరు జాబితా వెల్లడికి మరో షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించింది. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురించనున్నారు.
10న తుది జాబితా వెల్లడిస్తారు. చకచక లోకల్ బాడీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం ఆవహించింది. 20 నెలల ప్రజాపాలనలో ఎక్కడా ప్రజల మద్ధతును రేవంత్ రెడ్డి సర్కారు పొందలేక పోయింది. ఇచ్చిన హామీలను ఎగనామం పెట్టి ఇష్టారీతిన ప్రవర్తిస్తోంది. రైతులకు కనీసం పెట్టుబడి సాయం అందించలేదు. యూరియా బస్తాలు కూడా సరిగా సైప్లె చేయలేక చేతులు ఎత్తేసింది. నిత్యం యూరియా కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన బాట పడుతున్నారు. అయినప్పటికీ సర్కారులో చలనం లేకుండా పోయింది.
ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడుతోంది. ప్రజల్లో లేనిపోని అనుమానాలు చొప్పించి తద్వార లబ్ధి పొందాలనే కుటిల యత్నాల్లో భాగంగానే బీఆర్ఎస్పై బురద జల్లుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక పేరుతో హంగామా సృష్టించి అపవాదు అంటగట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుండటం వీస్తూ గొల్పుతోంది.
తెలంగాణకు శనిలా మారిన రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. హైడ్రా పేరుతో ఇండ్లు మొత్తం కూల్చుతున్నాడు. పైసలు లేవంటూ తెలంగాణను బజారుపాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అని మరిచిపోయి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, కేసీఆర్ జపం చేస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా చెప్పుకుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం నిందలు వేసి నీళ్ల పాలు చేస్తున్నాడు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని ప్రజలందరికీ తెలుస్తున్నది.
-చింత మహేశ్, తెలంగాణ ఉద్యమకారుడు
అసెంబ్లీలో ఆదివారం కాళేశ్వరంపై 600 పేజీల రిపోర్టుపై మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు. రిపోర్టు తప్పులతడక తప్ప అందులో ఎలాంటి నిజంలేదు. రేవంత్‌రెడ్డికి ఎప్పుడు కేసీఆర్‌ని బదనాం చేయాలా, కేటీఆర్‌ని ఇరుకున పెట్టాలా అనే ఆలోచన తప్ప, కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను మరిచిపోయాడు. కాళేశ్వరం ప్రాజెక్టును ముందు పెట్టుకొని అభివృద్ధిని మరిచి పోయారు. ప్రజలను తప్పుదోవ పట్టించి కేసీఆర్‌పై బురద చల్లే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. కాళేశ్వరం చూసి ఆనందపడాల్సింది పోయి కూలిపోయిందని చెప్పడం సిగ్గు చేటు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 1: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా బాధాకరం. కేసీఆర్ రైతన్నల కండ్లలో ఆనందం చూడడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కష్టాల నుంచి విముక్తి పొందాలని కాళేశ్వరం జలాలతో యావత్ తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దే. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
-శక్కరికొండ కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు
ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 1: తెలంగాణ ప్రజల కల్పతరువుగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ‘కాళేశ్వరం’పై విచారణ సీబీఐకి అప్పగించడంతో కుట్రదారులు బయటపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనేదానికి ఇది నిదర్శనం. కేసీఆర్‌ను టచ్ చేయలేరు. ఆయన అపార మేధావి. ముందస్తు జాగ్రత్తతోనే తెలంగాణ ప్రజలకు వరంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కామారెడ్డిలో అంతపెద్ద విపత్తు వస్తే ఎవరికీ సాయం చేయడంలేదు. రేవంత్ రెడ్డిది అసమర్థపాలన. కేసీఆర్‌ను ఢీకొనడం ఆయనతోపాటు అతడి బాస్తరం కూడా కాదు.