నిజామాబాద్, ఏప్రిల్ 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు వేచి, విలువైన సమయాన్ని కోల్పోయిన యువకులకు ఇప్పుడు అర్హత వయస్సు 34 ఏళ్లకు పరిమితం చేయడంతో అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తీరని అన్యాయం ఏర్పడుతోంది. బీఆర్ఎస్ పరిపాలనలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వయసు పరిమితిని మానవతా దృక్పథంతో 44ఏళ్లకు పెంచారు.
ఎస్సీ , ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకు అవకాశాలు ఇచ్చారు. ఈ వయో పరిమితి పెంపును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తొలగించి షాక్‌కు గుర చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వేలాది మంది యువత ఒక్కసారిగా అనర్హతకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 67వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటోంది. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రవేశ, అర్హత పరీక్ష నిర్వహించలేదు. కేసీఆర్ హయాంలో నిర్వహించిన పరీక్షలకు ఫలితాలిచ్చి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. కేసీఆర్ ఘనతను తన గొప్పతనంగా ప్రచారం చేసుకుంటూ రేవంత్ రెడ్డి పాకులాడుతున్నాడని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగ యువతీ, యువకులు ఉసురు మంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి తమ జీవితాలు బలి అవుతున్నాయని బాధ పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని భావిస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించకుండానే నోటికాడి బుక్కను లాక్కునే విధంగా వయో పరిమితి పేరుతో మోసం చేయడం తగదంటూ చెబుతున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో జరిగిన తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర ఎనలేనిది. వారి ప్రాధాన్యతను గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సడలింపును ఇచ్చారు. తద్వార ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎంతో మందికి లాభం జరిగింది. సమైక్య పాలనలో ఉద్యోగాల్లేక నీరుగారిన ఆశలతో డీలా పడిన వారికి కేసీఆర్ సర్కారు తీపి కబురుతో అవకాశాలు అందించింది. కానిప్పుడు భిన్నమైన పరిపాలన జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మానవీయత అన్నద కనిపిండం లేదు. హైడ్రా పేరుతో సామాన్య కుటుంబాలను రోడ్డున పడేస్తున్నట్లే టీజీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల ద్వారా నిర్వహించే ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి సడలింపును తొలగించడం హేయంగా మారింది. ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత ఏర్పడుతోంది.
2023, డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే నియామక ప్రక్రియను వేగంగా చేపట్టి ఉంటే చాలా మందికి మేలు జరిగేది. వాస్తవానికి గతంలో నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు ప్రకటించి నియామకాలను చేపట్టారు. కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దరఖాస్తు స్వీకరించలేదు. పరీక్షలు పెట్టలేదు. తద్వార ఎంతో మందికి 44 ఏళ్లలోపు వయసు ఉన్న వారంతా అర్హత ఉన్నప్పటికీ అవకాశాలు లేక నీరసించి పోయారు. కానిప్పుడు అకస్మాత్తుగా సడలింపును పొడిగింపు ఇవ్వకపోవడంతో 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న లక్షలాది మంది యువతకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో గుండెలు పగిలే విధంగా మారింది. రూ.వేలు వెచ్చించి నెలల తరబడి కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఈ నిర్ణయం బాధ కలిగిస్తోంది.
ఏప్రిల్ 20న టీజీపీఎస్సీ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో వయస్సు అర్హతను 18 నుంచి 34ఏళ్లుగా నిర్ధారించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్లూఎస్ వర్గాలకు సాధారణంగా వర్తించే 5ఏళ్ల సడలింపు మాత్రమే వర్తింపజేశారు. 44 ఏళ్ల వయో పరిమితి అర్హతను ఇందులో తీసి వేయడంతో ప్రభుత్వం మున్ముందు చేపట్టబోయే నియామకాలకు ఇదే రీతిన ప్రక్రియను చేపట్టబోతున్నట్లుగా అవగతం అవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 25వేల నుంచి 30వేల మంది నిరుద్యోగులున్నారు. వివిధ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో 20 నుంచి 30శాతం మందిపై వయో పరిమితి 44ఏళ్లకు రద్దు అన్నది అశనిపాతంగా మారనుంది.