నిజామాబాద్, డిసెంబర్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు నుంచి సింగూర్ ప్రాజెక్టులోని నీటి నిల్వను ఖాళీ చేయాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. నీటిని దిగువకు పంపించడం ద్వారా మిషన్ భగీరథ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడనుంది.
సాధారణంగా ఎండాకాలం వచ్చిదంటే జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురవుతుంది. అలాంటిది వేసవి కాలానికి ముందే సింగూర్‌లోని నీళ్లను వదిలేస్తే తీవ్రమైన దాహార్తి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదకరమైన పరిస్థితులు కళ్ల ముందే గోచరిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు లేకపోవడం విడ్డూరంగా మారింది. సింగూర్ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్‌కు 6.96టీఎంసీలు, మిషన్ భగీరథకు మరో 5.70టీఎంసీలు నీటి వినియోగం అవుతుంది. ఈ ఖాళీ ప్రక్రియ వల్ల మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు శుద్ధమైన జలాల పంపిణీకి బ్రేక్ పడనుంది. లక్షలాది మంది ప్రజలకు తాగునీటి సమస్యను తెచ్చి పెట్టనుంది.
కేసీఆర్ పరిపాలనలో రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా గడప గడపకు అందిస్తున్న నీళ్లను తరలించడం అదో భారీ ప్రక్రియ. జలాశయం వద్ద ఫిల్టర్ చేసిన నీళ్లను పైప్‌లైన్ ద్వారా ప్రజలకు ముంగిటకు చేర్చాలంటే ఊహాకు అందని ఇంజనీరింగ్ మహిమతో కూడుకున్నది. ఉభయ జిల్లాలకు మిషన్ భగీరథ నీటికి సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే కీలకం. సింగూర్ ప్రాజెక్టు నీటి ద్వారా బోధన్ నియోజకవర్గంలో 4 మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలో 6 మండలాలు, బాన్సువాడ నియోజకవర్గంలోని 8 మండలాలతో పాటుగా ఎల్లారెడ్డిలోని 3 మండలాలు మొత్తం 21 మండలాల్లో 819 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది.
సింగూర్ సెగ్మెంట్ పరిధిలో 21 మండలాలకు 819 ఆవాసాలకు నీళ్లు అందుతున్నాయి. 518.44 కిలో మీటర్లు పైప్ లైన్ వేశారు. ఈ వ్యవస్థ ద్వారానే సుదూరంగా ఉన్న సింగూర్ నుంచి కామారెడ్డి జిల్లాకు తాగునీరు అందుతోంది. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటుగా ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు మొత్తం 554 గ్రామాలకు తాగునీటి పథకం వల్ల లాభం జరుగుతోంది. శ్రీరాంసాగర్ సెగ్మెంట్లో 1547 కిలో మీటర్లు మేర పైప్‌లైన్ అమరిక ఉంది. 862 ఆవాసాలకు బల్క్‌వాటర్ సైప్లె విజయవంతంగా ప్రతి రోజూ సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సింగూర్, ఎస్సారెస్పీ సెగ్మెంట్ల ద్వారా 1681 ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం వల్ల శుద్ధ జలాలు అందుతున్నాయి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ప్రభావితం చేసే కీలకమైన ఉపద్రవం కండ్ల ముందు కదలాడుతుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతానికి సైతం ముప్పు పొంచి ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ముప్పు వాటిల్లనున్నది. మిషన్ భగీరథ అధికారుల లెక్కల ప్రకారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 21 మండలాల్లోని 819 ఆవాసాలకు ప్రభావం చూపనుంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్న చొరవ శూన్యంగా కనిపిస్తోంది. సింగూర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లను వదలాలని ఎన్డీఎస్ఏ పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొద్ది మొత్తంలో నీళ్లను వదిలేసి మరమత్తులు చేయాలని యోచిస్తున్నట్లుగా కనబడుతోంది. ఏ విధంగా పరిశీలన చేసినప్పటికీ తాగునీటికి నీటి కటకట తప్పడం ఖాయంగానే ఉంది. డిసెంబర్ నెలాఖరులో నీటి విడుదల మొదలు పెట్టాలని ఇరిగేషన్ శాఖ ఆలోచన చేస్తున్నట్లుగా కనబడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్‌లు ఈ విషయంపై కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా మారింది.
సింగూరు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండడంతో సింగూరు ప్రాజెక్టు నీటిని ఖాళీ చేయనున్నట్లు తెలిసింది. నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా బయటపడుతున్నది. ప్రభుత్వం ప్రజలు, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిజాంసాగర్‌కు కాళేశ్వరం నీటిని రప్పించడంతో సింగూరు ప్రాజెక్టు నీటిని జంటనగరాలకు అందిస్తున్నారు. అలాంటి సింగూరు ప్రాజెక్టుపై ప్రభుత్వం చిన్న చూపు తగదు.
-గుంటి దశరథ్, నిజాంసాగర్
సింగూరు ప్రాజెక్టు నిజాంసాగర్‌కు గెండెకాయ లాంటిది. అ లాంటి ప్రాజెక్టులో నీటిని గాలికి వదిలేస్తే భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తప్పవు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు త్వరగా పూర్తిచేసి ఇబ్బందులు లేకుండా చేయాలి. లేదంటే రైతులకు సాగునీటి, ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగాలి.
-మిడత సాయిలు, మహ్మద్‌నగర్