నిజామాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ఘోరంగా విఫలమైంది. పథకం అమలులో మాయాజాలం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొత్తం నాలుగు పంట కాలాలు వచ్చాయి. ఇందులో మూడు పంట కాలాలు ముగిశాయి. రెండు యాసంగి సీజన్లు, మరో రెండు వానాకాలం సీజన్లు వచ్చినప్పటికీ రైతు భరోసా అమలైంది కేవలం రెండు సీజన్లకు మాత్రమే కావడం గమనార్హం.
అమలైన పంట కాలాల్లోనూ ఒక సీజన్లో అరకొరగానే పెట్టుబడి సాయం అందించారు. మరో సీజన్‌కు సంబంధించిన రైతుభరోసాను ఇప్పుడు అందిస్తున్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే వానాకాలం- 2025లో రైతుభరోసాను సంపూర్ణంగా అమలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వ బాండ్లను పెట్టి నిధులను సమీకరించింది. ఎలాంటి షరతుల్లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన విధంగానే ఈ సీజన్లో రైతుభరోసా సాయాన్ని జమ చేయడంపై సర్వత్రా ఆశ్చర్యంవ్యక్తమవుతున్నది.
దీనిపై రైతుల్లోనూ చర్చ సాగుతున్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి సర్కారుకు ఉండి ఉంటే, యాసంగిలో అరకొరగా అందించిన పెట్టుబడి సాయం మాటేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2023 యాసంగి, 2024 వానకాలం రైతుభరోసాపై స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేక చతికిల పడుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు.దర్జాగా సాగు బాటలో విజయం సాధించారు. కాలంతో సంబంధం లేకుండా సాగు నీరు, నిరంతర విద్యుత్, మద్దతు ధరకు పంటల కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతుబంధు సాయం సక్రమంగా అమలైంది. రైతులకు వెలుగు జిలుగులు ప్రసాదించగా ఇప్పుడంతా గడ్డు కాలమే దాపురించింది. ఇలాంటి పరిస్థితిలో స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్ పార్టీ చతికిల బడడం ఖాయంగానే కనిపిస్తున్నది. రైతులంతా ఓటు అనే ఆయుధంతో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుయుక్తులను ప్రజలు గమనించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా హస్తం పార్టీ హామీలు, వారి మాటలను నమ్మి ఓటేశారు. ఏడాదిన్నర కాలంలో ప్రజా పాలనలో ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. స్వీయ అనుభవంలో ప్రజలంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్న తీరు వాడవాడకు తెలిసి పోయింది. రైతులకు సాగు బాటలో సాయం అందలేదు.
వడ్ల కొనుగోళ్లలో వేగం లేక కర్షకులు చతికిల పడ్డారు. బోనస్ రూ.500 ఇస్తామని చెప్పి యాసంగిలో రూ.499 కోట్లు ఉమ్మడి జిల్లా రైతులకు బకాయిలు చెల్లించలేదు. రైతుభరోసా ఎకరానికి ఏటా రూ.15వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం రూ.12వేలకు పరిమితం చేశారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదు. జీలుగ విత్తనాల ధరలను అమాంతం మూడు రెట్లు పెంచారు. సరిపడా జీలుగ విత్తనాలు సరఫరా చేయకపోవడంతో విక్రయకేంద్రాల వద్ద రైతులు బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. సాగు కాలంలో రైతన్నలు పడుతున్న పాట్లు పదేండ్ల క్రితం నాటి సమైక్య పాలనను మరోసారి గుర్తుకు చేసింది.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో ఓట్లను రాబట్టుకున్నది. దేవుళ్లపై ఒట్టు వేసి రైతు రుణమాఫీ చేస్తామంటూ ప్రతి ప్రచారసభ వేదికలపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ఎన్నికల సభలో బాసర సరస్వతీ అమ్మవారిపై ప్రమాణం చేశారు.
లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే రుణమాఫీ పూర్తి చేస్తామని ఢంకా బజాయించి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు జరిగి దాదాపుగా ఏడాది గడిచినా ఇప్పటివరకూ అతీగతీ లేకుండా పోయింది. హామీలన్నీ గాలికి కొట్టుకు పోయాయి. అరకొరగానే రుణమాఫీ చేసి మమ అనిపించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వారంతా దిక్కూ మొక్కూ లేకుండా పోయారు. అర్హతలు ఉన్నప్పటికీ రుణాలు రద్దు కాకపోవడంపై అయోమయానికి గురవుతున్నారు. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో గిమ్మిక్కుతో ముందుకువస్తున్నది.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వేసిన పాచికనే మరోసారి ప్రయోగిస్తున్నది. అబద్ధపు హామీలు, కుట్రలు, కుతంత్రాలతో రైతులను తమవైపు తిప్పుకునేందుకు తంటాలు పడుతున్నది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జూన్ 16న రైతుభరోసాను అమలుకు శ్రీకారం చుట్టారు. బకాయిల మాట మాత్రం ఎత్తకపోవడం గమనార్హం. యాసంగిలో పెట్టుబడి సాయం అందని రైతులకు తీపి కబురు చెబుతారనుకుంటే నిరాశ మిగిలింది.