నిజామాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగ యువత పథకమంటూ ఊదరగొట్టారు.
అర్హులైన వారందరికీ రుణాలు అందించి ఆదుకుంటామని, దరఖాస్తు చేసుకోవాలంటూ యువతకు సూచించారు. ఈ పథకాన్ని జూన్ 2 నుంచి అమలుచేస్తామని చెప్పగా.. ఇప్పటివరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. పథకం గురించి అధికారులను అడిగితే తమకేం సంబంధం లేదంటూ తప్పించుకోవడం గమనార్హం. రాజీవ్ యువ వికాసం పథకం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న కాపీలను పట్టుకొని అప్డేట్ కోసం అధికారులు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన దుస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇందులో జనాభా ప్రాతిపదికన యూనిట్లు కేటాయించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు 35,732 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం 1,03, 558 మంది ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించారు. సుమారు ఒక్కో యూనిట్‌కు ఒక్కో మండలంలో ఆయా సామాజిక వర్గాల వారీగా భారీ పోటీ ఏర్పడింది. ప్రతి యూనిట్‌కు సగటున ఐదుగురు పోటీ పడుతున్నట్లు అధికారులు లెక్కలు తీశారు. జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా ఆయా వర్గాలకు యూనిట్లను కేటాయించారు. తిరిగి మండల్లాలో సామాజిక వర్గాల వారీగా జనాభాను విభజించి తద్వారా యూనిట్లను కేటాయించారు. రాయితీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పడంతో యువత చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ‘రాజీవ్ యువ వికాసం’ ఊసే కరువైంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం గడిచిపోయి నెలన్నర రోజులు గడుస్తున్నా పథకం అమలు తీరుతెన్నులపై స్పష్టత కొరవడింది. చాలా మంది రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చే ప్రయోజనాన్ని దక్కించుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని భావిస్తున్నారు. అలాంటి వారి ఆశలపై కాంగ్రెస్ సర్కారు ఊరించి ఉసురుమనిపించింది. పథకం అమలుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో చేసేది లేక ఇతరత్రా పనుల్లో చేరేందుకు దరఖాస్తుదారులు సిద్ధపడుతున్నారు. ఈ పథకం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలని కాంగ్రెస్ పార్టీ యోచించింది. తీరా ఇప్పుడు పథకాన్ని అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై యువత తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు.
నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఓ వైపు ఉద్యోగాల భర్తీని అటకెక్కించింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీఎస్సీ మినహా కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. ఉద్యోగాల భర్తీని సర్కారు మరిచి పోయింది. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో యువతకు అన్యాయం జరుగుతున్నది. నిరుద్యోగులను ఆదుకుంటామని ఘనంగా ప్రకటనలు జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని పక్కన పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అనేక మంది యువకులు ఈ పథకంలో లబ్ధి పొందాలని యోచించారు. అలాంటి వారి ఆశలపైనా ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉద్యోగాలు భర్తీ చేయక, నిరుద్యోగ భృతి ఇవ్వక, నిరుద్యోగులకు స్వయం ఉపాధికి మార్గం సులభం చేయక కాంగ్రెస్ సర్కారు కాలం గడుపుతున్నది.
సెప్టెంబర్ లోగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరులోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ జారీ చేస్తే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో యూనిట్ల మంజూరు గగనం కాగా ఇప్పట్లో ఈ పథకం అమలు కావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ మధ్యనే కామారెడ్డి జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులు నేరుగా ప్రజావాణికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు యూనిట్లు ఇస్తారా? ఇవ్వరా? అంటూ అధికారులను నిలదీయగా సమాధానం కరువైంది.
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం, రుణాలు ఇప్పించడం, రాయితీల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కన్వీనర్‌గా ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సభ్యులుగా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. 2025 ప్రారంభంలో ఈ కమిటీ నేతృత్వంలో హడావుడి జోరుగా సాగింది. ఇప్పుడు ఈ కమిటీ సుషుప్తావస్థలోకి చేరింది. కనీసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను చేపట్టడం లేదు. గ్రామాల్లో అనేక మంది యువకులకు ఉపాధి లేక ఇతర మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. గల్ఫ్ బాట పట్టేందుకు సిద్ధ పడుతున్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా లాభం జరుగుతుందని ఆశ పడిన వారికి నిరాశే మిగిలింది. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అన్వేషించడంపై యువత దృష్టి సారించింది.