నిజామాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న ది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో ఎలక్షన్లు పెట్టకుండా ప్రభు త్వం కాలయాపన చేసుకుంటూ వస్తున్నది. ఏడాది కాలంగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొస్తున్నది. అయితే, తాజాగా కొం దరు మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఆశావాహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఈ నెలాఖరులో స్థాని క సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రులు ప్రకటించడంతో పల్లెల్లో ‘స్థానిక’ సందడి మరోసారి పెరిగింది.
అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక ‘చేతు’లెత్తేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే జనాల్లో అసహనం వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. పల్లె పోరులో పరాభవం తప్పదనే భయం తో ఎలక్షన్లు నిర్వహించకుండా స్పెషలాఫీసర్లతో నెట్టకొస్తున్నది. ఫలితంగా గ్రామా ల్లో పరిపాలన స్తంభించింది.
మరోవైపు, ఎన్నికలు నిర్వహించక పోవడంతో రేవంత్ సర్కారుపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలకవర్గాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం స్థానిక పోరుకు సన్నద్ధమైంది. ఇప్పటికే మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లీకులు ఇవ్వడంతో స్థానిక పోరు ఖాయమైనట్లుగానే ప్రచారం జరుగుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లపై తెచ్చిన చట్టం ప్రకారం పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమలులో ఉంచుకోవచ్చు. దీని ప్రకారం మరో ఐదేళ్లు పాత రిజర్వేషన్లు కొనసాగించే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు కొత్త విధానానికి మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి మొగ్గు చూపితే ఎన్నికలు మరింత ఆలస్యం కావొచ్చని అధికారులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 27 జడ్పీటీసీ, 299 ఎంపీటీసీ, 530 సర్పంచ్ స్థానాలుండగా, కామారెడ్డి జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ, 536 సర్పంచ్ స్థానాలున్నాయి. అధికారులంతా పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాల మార్పుచేర్పు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు పోలింగ్ నిర్వాహణకు రెడీగా ఉన్నారు. అయితే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండడంతో ఆశావాహుల్లో రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
రిజర్వేషన్ల అమలుపైనా గ్రామాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా.. లేక కొత్తవి ప్రకటిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. ఇదే పరిస్థితి పురపాలక సంఘాల్లోనూ కనిపిస్తున్నది. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతూ నిధులు మంజూరు చేయించుకుని పల్లెల్లో ఇప్పటికే రహదారులు, ఇతర పనులను చేయిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారికి సీఎంఆర్ఎఫ్ నిదులు ఇప్పించి, తద్వారా ఓట్లు దండుకోవాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు.
18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులైతే గుడ్డిగా రేవంత్ మాటలను, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి మోసపోయామంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రైతుభరోసా, రుణమాఫీ, బోనస్ డబ్బులు రాక తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. మహిళలందరికీ రూ.2500 చొప్పున పింఛన్ చేస్తామన్న కాంగ్రెస్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. సామాజిక పింఛన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీని సైతం అమలు చేయలేదు. ఇలా ఎన్నో హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో భారీ వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ గడ్డు కాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నిలబడే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన సెగ తగలడం ఖాయమన్న చర్చ జరుగుతున్నది. పదేళ్ల పాటు సంక్షేమ పాలన అందించిన బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశముందన్న భావన వ్యక్తమవుతున్నది.