Kesha Vs WhiteHouse | అమెరికా ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఒక వీడియో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసింది. ప్రముఖ పాప్ గాయని కేశా (Kesha) తన అనుమతి లేకుండా, తన పాటను సైనిక విన్యాసాల ప్రచారానికి ఉపయోగించడంపై వైట్‌హౌస్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది.
వివాదానికి కారణం ఇదే..
ఫిబ్రవరి 10, 2026న వైట్‌హౌస్ తన అధికారిక టిక్‌టాక్ ఖాతాలో Lethality (ప్రాణంతాక శక్తి) అనే పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో, ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ వీడియోలో.. అమెరికా యుద్ధ విమానం ఒక నౌకపై క్షిపణి దాడి చేసి ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ భీకర యుద్ధ దృశ్యాలకు నేపథ్య సంగీతంగా కేశా 2011లో పాడిన ‘Blow’ అనే హిట్ సాంగ్‌ను ఉపయోగించారు. ముఖ్యంగా అందులోని This place about to blow అనే సాహిత్యాన్ని యుద్ధ విమాన దాడికి అనువైనట్లుగా ఎడిట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేశా తాజాగా స్పందించింది.
యుద్ధాన్ని, హింసను ప్రేరేపించడానికి నా సంగీతాన్ని వాడుకోవడం అత్యంత అసహ్యకరంగా ఉంది. మనుషుల ప్రాణాలు తీసే యుద్ధాన్ని ఇలా వినోదంలా చూపడం అమానుషం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ట్రంప్‌ను ‘క్రిమినల్ ప్రిడేటర్’ అని సంబోధిస్తూ.. ఎప్స్టైన్ ఫైల్స్‌లో ఆయన పేరు వందల సార్లు ప్రస్తావనకు వచ్చిందని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేసింది. అంతేగాకుండా నా అనుమతి లేకుండా నా పాటను వాడటం ఆపండి సన్నాసుల్లారా (Perverts) అంటూ ఆమె వైట్‌హౌస్ వర్గాలను ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించింది.
రాజకీయ ప్రచారాలకు లేదా సైనిక అవసరాలకు కళాకారుల అనుమతి లేకుండా వారి పాటలను వాడుకోవడం అమెరికాలో కొత్తేమీ కాదు. గతంలోనూ రేడియోహెడ్, ఒలివియా రోడ్రిగో, సబ్రినా కార్పెంటర్ వంటి సెలబ్రిటీలు తమ సంగీతాన్ని ట్రంప్ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకోవడాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైట్‌హౌస్ చేసిన ఈ పని ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
Stop using my music, perverts @WhiteHouse
— kesha (@KeshaRose) March 3, 2026