Donald Trump : ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం ఇరాన్ (Iran) పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా (USA) సిద్ధమైంది. ఇరాన్‌పై ఇక భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trmup) హెచ్చరించారు. రాబోయే 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయబోతున్నట్లు అమెరికా అధికారులు కూడా పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో ఈ హెచ్చరికలు మరింత ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై తాము ఇప్పటివరకు పెద్ద దాడులేమీ చేయలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తాము ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తామని, ఇది చాలా శక్తిమంతంగా ఉంటుందని అన్నారు. తమ దగ్గర ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉందని చెప్పారు. తాము ఇక ఆ సైన్యాన్ని ఉపయోగిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు.
యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవడం లేదని, త్వరలోనే ముగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అనుకున్న దానికంటే ముందుగానే తమ లక్ష్యాలను సాధిస్తున్నట్లు చెప్పారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగడం ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. వారు తీవ్రస్థాయిలో ఇరాన్‌తో పోరాడాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరాన్ దేశానికి నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే విషయం తనకు తెలియదన్నారు.
యురేనియం శుద్ధిని ఆపేందుకు ఆ దేశం సిద్ధంగా లేదని, వారిని అడ్డుకునేందుకు సైనిక చర్యే సరైన మార్గమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ ఒక కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ సహా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా పౌరులు ఆయా ప్రాంతాలను వీడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. భద్రతా కారణాలవల్ల అమెరికన్లు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలతో అక్కడినుంచి తరలిపోవాలని సూచించింది.