Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ‘ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో గొప్పోళ్లమని చెప్పుకొనేటోళ్లకు నేను తాతను.. నాడు వాళ్లు గజాల్లో కట్టుకున్నప్పుడు నేను ఎకరాల్లో కట్టిన. 25 ఏండ్ల క్రితమే పుప్పాలగూడ, కోకాపేటలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలిన’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో తన ఆనవాళ్లు ఉంటాయని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ఉంటే తాను వేల కోట్లు సంపాదించేవాడినని తెలిపారు. శుక్రవారం శాసనసభలో విద్యారంగంపై చర్చకు సమాధానంగా సీఎం మాట్లాడుతూ ‘నేను రియల్ ఎస్టేట్ చేసిన. కోకాపేట, మంచిరేవులలో ఎవర్ని అడిగినా చెప్తరు.. 25 ఏండ్ల కిత్రం ఈ ప్రాంతాన్ని, ఈ ఊర్లను కనిపెట్టిన.
ఈ ఔటర్ రింగురోడ్డు ఎక్కడ నుంచి ఎటు పోతుందో చెప్పిన. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసింది ఎవరయ్యా అని అడిగితే అక్కడ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నోళ్లు చెప్తరు. ఇప్పుడు గొప్పలు చెప్పుకొనేవాళ్లను నేను తాతను. వాళ్లు గజాల్లో కట్టుకుంటే నేను ఎకరాల్లో కట్టిన. అందులో నేను వేల కోట్లు సంపాదించేవాడిని’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా తాను రియల్ కింగ్‌నని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొన్నారు. ఇక తాను శ్రీశ్రీ లాంటి వాడినని, ప్రపంచ బాధను తన బాధగా తీసుకుంటానని తెలిపారు. ‘నేను పేదోన్ని కాదు. మేం శ్రీమంతులం. నేను పేదోన్నని ఎప్పుడూ చెప్పుకోలే. మా నాయన పోలీస్ పటేల్.. మాకూ భూములున్నయ్.. అయినా నాకు పేదరికం గురించి తెలుసు’ అని చెప్పారు.
‘నాకు దేవుడు అన్నీ ఇచ్చిండు. విద్య, వ్యాపారం, పెండ్లి, పిల్లలు, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి పదవి అన్నీ ఇచ్చిండు’ అని రేవంత్ చెప్పారు. తమ బంధువుల్లో జాతీయ స్థాయి నాయకులున్నా వాళ్లకు ఈ కుర్చీ (సీఎం) కావాలని మనుసులో కోరిక ఉన్నా కాలేదని తెలిపారు. చరిత్ర కలిగిన పార్టీకి అధ్యక్షుడు కావాలనుకున్నా వాళ్లు కాలేదని, తాను అయ్యానని చెప్పారు. పరోక్షంగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. కోట్లలో ఒక్కరికి వచ్చే అవకాశం తనకు వచ్చిందని, దీన్ని ప్రజాసేవ కోసం వినియోగిస్తానని సీఎం తెలిపారు.
పాటిటెక్నిక్లను ప్రైవేటీకరిస్తామనేది అబద్ధమని, అవి ప్రభుత్వంలోనే ఉంటాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే జీవో 97లో సవరణలు చేస్తామని చెప్పారు. విద్యార్థులపై ఫీజుల భారం పడదని, లేటరల్ ఎంట్రీ ఉంటుందని స్పష్టంచేశారు. దీనిపై విద్యార్థులు, ఉద్యోగులకు అపోహలు వద్దని చెప్పారు. విద్యార్థుల కోసం లెక్చరర్స్‌ను నియమించుకున్నామే తప్ప.. లెక్చరర్స్‌కు జీతం ఇచ్చేందుకు విద్యార్థులను తీసుకోవడంలేదని స్పష్టంచేశారు.
విజిలెన్స్ విచారణలో క్లీన్చిట్ ఉన్న కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని, వాటి బకాయిలు కూడా చెల్లిస్తామని సీఎం చెప్పారు. మిగిలిన కాలేజీలకు ఇవ్వబోమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కాలేజీలు రెండుసార్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. తొలుత సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు విద్యార్థుల వద్ద, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రెండుసార్లు ఫీజులు తీసుకుంటున్నాయని తెలిపారు. తాను వచ్చినప్పటి నుంచి కాలేజీల యాజమాన్యాలు పేట్రేగిపోతున్నాయని, తాను అణచివేయకపోవడం వల్లే ఇలా చేస్తున్నాయని హెచ్చరించారు.