హైదరాబాద్ : రాష్ట్రంలో నేతన్నల ( Handloom workers ) ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ( MLC Ramana ) ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల ( Siricilla ) సభ వల్ల జిల్లా ప్రజలకు ముఖ్యంగా నేతన్నలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. పది రోజుల నుంచి ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెట్టి చివరకు చేతులెత్తేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 54 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు కేటీఆర్ మంత్రిగా నేతన్న బీమా పథకం కింద అనేక నేతన్న కుటుంబాలను ఆదుకున్నారని వివరించారు. నేతన్నలకు 1,753 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.
సీఎం స్థాయి వ్యక్తి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అన్నారు. సిరిసిల్లలో ప్రభుత్వ సభ కాంగ్రెస్ పార్టీ సభలాగా జరిగిందని దుయ్యబట్టారు. నేతన్నలకు పని కల్పిస్తే పని చేయడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడాన్ని రమణ తప్పుబట్టారు. పని కల్పిస్తే నేతన్నలను పని చేయించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి తుమ్మలకు ఛాలెంజ్ చేశారు.
ప్రభుత్వం తప్పుడు లెక్కలతో నేతన్నలను మభ్యపెట్టాలని చూస్తోందని పేర్కొన్నారు. సీఎం సభ పెట్టినంత మాత్రాన కేటీఆర్ బలహీనపడరని, ఇంకా శక్తివంతమవుతారు అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ ,మాణిక్ రావు , డాక్టర్ మెతుకు ఆనంద్ , బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ , బీఆర్ఎస్ నాయకులు గౌతం ప్రసాద్ ,శ్రీధర్ పాల్గొన్నారు .