Kubir | కుభీర్: కుభీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన సరికొండ లావణ్య- అనిల్ దంపతుల కుమారుడు వరుణ్ కుస్తీ (Kusti) పోటీల్లో రాణిస్తున్నాడు. దీంతో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో వరుణ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. జిల్లా స్థాయిలో ప్రత్యర్థులపై పైచేయి సాధించి అందరి ప్రశంసలు అందుకున్న వరుణ్ రాష్ట్ర స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
వరుణ్ భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తున్నాడు. అతడి ప్రతిభను నిగ్వ గ్రామస్థులు కొనియాడుతున్నారు. జిల్లా స్థాయి పోటీలు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని వరుణ్ తెలిపాడు. రాబోయే రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకం (Gols Medal) సాధించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నాడు.