Abhijeet Dipke : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్పష్టంచేశారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. అక్టోబర్ 2 నుంచి ఈ నిరసనలు ప్రారంభంకానున్నట్లు అభిజీత్ దీప్కే తెలిపారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ నియామకంలో పారదర్శకత ఉండాలని, పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పించాలని అన్నారు. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 2న సాయంత్రం ‘జైల్ భరో ఆందోళన్’ చేపట్టాలని సీజీపీ నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ సభల నిర్వహణకు అనుమతి లేదని తెలిపారు.
ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని సూచించారు. ఇదిలావుంటే పోలీసులే కాకుండా శివాజీ పార్క్ పరిసరాల్లోని నివాసితులు కూడా ఈ నిరసనను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది.