నిజామాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార కాంగ్రె స్ పార్టీకి తలపోటుగా మారింది. పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్విహంచలేక తలలు పట్టుకుంటోంది. పదవీకాలం ముగిసిన సమయంలో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చారు. ఆ తర్వాత రైతు భరోసా, సన్న వడ్లకు రూ.500 బోనస్ వంటి పథకాల అమలు లేకపోవడంతో వెనుకడుగు వేశారు. మూడు సీజన్లలో రైతు భరోసాను నిలిపేసి వానాకాలం 2025లో పెట్టుబడి సాయం అందించారు. దీంతో రైతులను మచ్చిక చేసుకుని ఎన్నికలకు వెళ్లొచ్చనే భ్రమలో అధికార పార్టీ మునిగి తేలింది.
గతేడాది ఎన్నికల షెడ్యూల్ జారీ ఒక్కటే మిగిలి ఉండగా అనూహ్యంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. తీరా ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు తథ్యమనే అంతా భావించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికల ఏర్పాట్లు తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా స్థాయిలో పంచాయతీ, జిల్లా పరిషత్ అధికారులంతా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల కూర్పును ముగించారు. కానిప్పటి వరకు స్థానిక పోరుకు షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ సర్కారు చేస్తోన్న ఈ దోబూచులాటపై ప్రజలతో పాటుగా హస్తం పార్టీ శ్రేణులు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో పరిపాలన కుంటు పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక ముచ్చటే కనిపించడం లేదు. దీంతో నిధుల కొరతతో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. స్పెషల్ అధికారుల చేతుల్లో జీపీలు విలవిల్లాడుతున్నాయి. ప్రతి పనికి పైసా అన్నట్లుగా అనేక చోట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శలు, మండల పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు దోపీడీకి పాల్పడుతున్నారు.
మురుగు నీటి నిర్వాహణ, తాగునీటి కల్పన, స్వచ్ఛతా కార్యక్రమాలు, వీధి దీపాల నిర్వాహణ వంటివేవి సరిగా అమలు కావడం లేదు. నిధుల లేమి పేరుతో పరిపాలనను అటకెక్కించడంతో గ్రామాలన్నీ కూనరిల్లుతున్నాయి. పల్లెల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం సోయి లేకపోవడంపై ప్రజలంతా తీవ్ర స్థాయిలో మండపడుతున్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాల్లో పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అడుగడుగునా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీ మంత్రులు మాటల్లో ఊదరగొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు మాత్రం ససేమిరా అంటుండటం విడ్డూరంగా మారింది.
లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితి లేదు. క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట గట్టుకుంది. నిఘా వర్గాలు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాయి. ఈ పరిస్థితిలో ఎన్నికలకు పోతే కంగుతినడం ఖాయమనే కారణంతో ప్రభుత్వం ఎన్నికలకు అకస్మాత్తుగా బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది. హైకోర్టు ఇచ్చిన 3నెలల గడువుపై మరికొంత సమయాన్ని అడగటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తీవ్ర జాప్యం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్లుగా జనాలంతా విమర్శిస్తున్నారు.
యూరియా కష్టాలతో రైతులంతా అల్లాడిపోతున్నారు. ఊరూరా యూరి యా కోసం బారులు తీరుతూ పనిపాట వదిలేసి సొసైటీల వద్ద వరుస కట్టేందుకే రైతుల సమయమంతా వెచ్చించాల్సి వస్తోంది. గతంలో కేసీఆర్ పాలనలో పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ పాలనలో యూరియా కష్టాలు రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే దాడి చేసేంత కోపంతో అన్ని గ్రామాల్లోనూ రైతులు ఆగ్రహంతో కట్టలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిలో రైతులు, రైతు కుటుంబాల వ్యతిరేకత సెగ స్థానిక ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడి పోతున్నట్లుగా తెలుస్తోంది.