నిజామాబాద్, జనవరి 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలికి రెండేళ్లు పూర్తైనప్పటికీ కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు జారీ కాకపోవడంపై ఆశావాహులు రగిలి పోతున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెబుతున్న మాయ మాటలపైనా దుమ్మెత్తి పోస్తున్నారు. ఏడాది కాలంగా ఉద్యోగ నియామకాలపై ప్రకటనలు చేస్తూ గాలికి వదిలేస్తున్నారు. కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయలేదు. కేసీఆర్ హయాంలో పలు శాఖల్లో ఉద్యోగాలకు చేపట్టిన ప్రక్రియను పూర్తి చేసి తన గొప్పగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లు దాటినప్పటికీ జాబ్ క్యాలెండర్ ఊసే కరువవ్వడం, కొత్త నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ పత్తా లేకపోవడంపై యువత నిలదీస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు చేపట్టిన పలు ఆందోళనలు జిల్లాల్లోనూ యువతను కదిలిస్తోంది. గ్రంథాలయాల్లో పుస్తకాల పురుగుల్లా మారి చదువుకుంటోన్న ఎంతో మందికి కాంగ్రెస్ సర్కార్ ఢోకా చేస్తోంది. నోటిఫికేషన్లు ఇవ్వకుండా గ్రంథాలయాలకే పరిమితం చేస్తున్న దుస్థితిపై యువత మండిపడుతున్నారు. రాష్ట్ర రాజధానిలో చెలరేగిన నిరసన కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలోనూ నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.
నిరుద్యోగ భృతి విధానాన్ని రూపొందించడంలోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడం లేదు. ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతిని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు ప్రక్రియను ప్రారంభించలేదు. ఎవరి ఆధారంతో ఎలా అర్హత నిర్దేశించబడుతుందో స్పష్టత లేదు. సాంకేతికంగా ఎలా అమలు చేస్తారు అన్నదీ తెలియదు. ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్సైంజీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. స్కిల్ సెంటర్ల ఏర్పాటు ఆమోద దశలోనే నిలిచిపోయింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం ఆచరణకు దూరంగా ఉన్నదనే అభిప్రాయం యువతలో నెలకొన్నది.
విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు, రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాల భరోసా వంటి హామీలు గాలికి కొట్టుకు పోతున్నాయి. ఎలాంటి ప్రణాళిక గాని, నిధుల విడుదల గాని జరుగలేదు. ప్రతి విద్యార్థికి రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై, యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్స్‌కు నెలకు రూ.10వేల ఫెలోషిప్ వంటి హామీలు కూడా ప్రయోగ దశలోనే ఉన్నాయి. విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం రూ.50వేలకు పెంచుతామని చెప్పిన మాటలు అమలులోకి రాలేదు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవడం, విభాగాల పునర్వ్యస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బ్యాగ్ లాగ్ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
రెండేళ్ల పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగ నియామకాల్లో ఘోరంగా విఫలమైంది. 59వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ బుకాయింపులకు పాల్పడుతూ టైం పాస్ చేస్తోంది. పూటకో మాటలతో కాలం గడుపుతోందంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత సర్కారులో విడుదలైన నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి భర్తీ చేసినట్లుగా చెప్పుకుంటుండటం హాస్యాస్పదంగా మారింది. అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామమంటూ కాంగ్రెస్ పార్టీ ఘనంగా చెప్పుకుంది. నిరుద్యోగులను రెచ్చగొట్టారు.
మేధావుల ముసుగులో కాంగ్రెస్ మౌత్ పీస్‌గా కొంత మంది మేధావులతో విష ప్రచారం చేయించారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల సమయంలో గొంతు చించుకుని గళం విప్పిన మేధావులంతా పదవులు స్వీకరించి నిరుద్యోగులను రోడ్డున పడేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం జాబ్ క్యాలెండర్ అనుసరించి 13 నుంచి 20 నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ జారీ కాలేదు. ప్రభుత్వ శాఖల్లో నెలవారీగా ఉద్యోగ ఖాళీలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఖాళీల భర్తీని చేపట్టకపోవడం వల్ల పదోన్నతులు సైతం నిలిచి పోతున్నాయి. నియామకాలు లేకపోవడం వల్ల పరోక్షంగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం నష్టం జరుగుతోంది. వారికి రావాల్సిన ప్రమోషన్లు ఆగి పోతున్నాయి. ప్రతి శాఖ నుంచి ఖాలీల వివరాలను సేకరించి, వార్షిక కాల పట్టిక ప్రకారం జాబ్ క్యాలండర్ కచ్చితంగా ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.