కోటగిరి, సెప్టెంబర్ 29: మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, దసరా పండుగ వచ్చినా ప్రభుత్వం కనికరించడంలేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి, ఎత్తొండ పంచాయతీ కార్మికులు సోమవారం ఆయా కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ.. నిత్యం పల్లెల్లో మురుగు కాలువలు శుభ్రం చేసూ ్త గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులపై కాంగ్రెస్ సర్కారు చిన్న చూపుచూస్తున్నదని మండిపడ్డారు. ప్రతినెలా ఇవ్వాల్సిన వేతనాలను మూడు నెలలు గడుస్తున్నా చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దసరా పండుగ వచ్చినా ప్రభుత్వం కనికరించడంలేదని వాపోయారు. పండుగ పూట పస్తులేనా అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దసరా పండుగకు తమ పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వరి, హన్మాండ్లు, పోశెట్టి, బ్రహ్మం, లింగం, సాయిలు, లక్ష్మి, లింగవ్వ, శోభ, సాయవ్వ పాల్గొన్నారు.