ఖలీల్‌వాడి, నవంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మాట ఇచ్చి మోసగిస్తున్నది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రెండు విడుతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దసరాకు ఒకసారి, దీపావళికి రెండోసారి నిధులు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వాధినేతలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ప్రైవేటు కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. నేటి నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేటు యాజమాన్యాలు పలుమా ర్లు అధికారులు, మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ కూడా నిర్వహించారు. అయినా కాంగ్రె స్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల చెప్పారని, నెలలు గడిచినా ఫలితం లేకుండా పోతున్నదని ఆవేదన చెందుతున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా 49 ప్రైవేటు జూనియర్ కాలేజీలు, గ్రాడ్యుయేషల్ కాలేజీలు 54 ఉన్నాయి. వీటిలో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్ల విషయంలో యాజమాన్యాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రూ.200కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రూ.300కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సోమవారం నుంచి కాలేజీల బంద్ పాటిస్తున్నట్లు కలెక్టర్‌తోపాటు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు తెలంగాణ యూనివర్శిటీ ప్రైవేటు కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోడంతో కాలేజీలు నడపడం కష్టంగా మారిందని, లెక్చరర్లు, సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వేతనాలు సరిగా రాకపోవడంతో లెక్చరర్ల కుటుంబపోషణ భారంగా మారిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కొన్ని కాలేజీల్లో అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఇలాగే ఉంటే కాలేజీలు నడపడం కష్టమే. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలి.
-జైపాల్‌రెడ్డి, అధ్యక్షుడు, టీయూ ప్రైవేటు కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్