ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయూత కింద రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇదిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలంతా ఇదే పాట పాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సైతం పదేపదే పింఛన్ పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్థించారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోలేక పోతున్నది.
అసలు పెంచుతారా.. పెంచరా? కొత్తవి ఇస్తారా.. ఇవ్వరా? అన్నది కూడా స్పష్టం చేయకుండా కాలం వెళ్లదీస్తున్నది. మరోవైపు, మాట తప్పిన సర్కారుపై లబ్ధిదారులు రుసరుసలాడుతున్నారు. గ్రామాల్లోకి వస్తున్న ప్రజాప్రతినిధులను పింఛన్ల పెంపుపై అక్కడక్కడ నిలదీస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధిని ప్రశ్నించడం మహిళల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది.
నిజామాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారమే పరమావధిగా ఎన్నికల ముందర అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కాక ఏ ఒక్కటీ అమలు చేయకుండా చేతులెత్తేసింది. రుణమాఫీ, రైతుభరోసా తదితర హామీలను పూర్తి చేయకుండా ఎగ్గొట్టిన రేవంత్ సర్కారు.. పింఛన్ల విషయంలోనూ రిక్త‘హస్తమే’ చూపింది. సామాజిక పెన్షన్ కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు ‘చేయి’చ్చింది. 16 నెలలవుతున్నా పింఛన్ల పెంపుపై నోరు మెదపడం లేదు. మరోవైపు, కొత్త పెన్షన్ల అంశాన్ని అటకెక్కించింది. దీంతో లక్షలాది మంది పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
పింఛన్ల పంపిణీని మానవీయ కోణంలో చూసిన కేసీఆర్.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచారు. అప్పట్లో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,016కు పెంచారు. ఠంచన్‌గా లబ్ధిదారుల చేతికి డబ్బులు అందజేశారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఏ రందీ లేకుండా కాలం వెళ్లదీశారు. మరోవైపు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎయిడ్స్, బోధకాలు వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధ పడుతున్న వారిని పట్టించుకోలేదు.
కానీ కేసీఆర్ వచ్చాక వారికి పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. అలాగే, బీడీ కార్మికులతో పాటు కల్లుగీత కార్మికులు, నేతన్నలకూ సామాజిక పింఛన్లు అందజేసి ఆలంబనగా నిలిచారు. మరోవైపు, ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్లు నిండిన వారికే వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేవారు. కానీ కేసీఆర్ వయస్సు పరిమితిని 57 ఏళ్లకు కుదించి.. లక్షల మందికి చేదోడుగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ కుటుంబంలోనూ ఏదో రకంగా పింఛన్ అందుతుందంటే అది ముమ్మాటికీ కేసీఆర్ గొప్పతనమే. నిజామాబాద్ జిల్లాలో ప్రతి నెలా సుమారుగా 2,51,910 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.52.70 కోట్లు వెచ్చిస్తున్నది. కామారెడ్డి జిల్లాలో 1,53,879 మంది ప్రతి నెలా రూ.32.84 కోట్ల మేర లబ్ధి పొందుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం కాంగ్రెస్ అనేక అలవి కాని హామీలు ఇచ్చింది. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులను లక్ష్యంగా చేసుకుని పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలు చేస్తామని ప్రకటించింది. అలాగే, అర్హులందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలందరూ ఊదరగొట్టారు. అంతేకాదు, రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.2,500 చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 16 నెలల కాలం గడిచి పోయింది. పింఛన్ల పెంపు, కొత్తవి మంజూరు అంశంపై రేవంత్ సర్కారు కిమ్మనడం లేదు. అంతేకాదు, నెలనెలా ఇవ్వాల్సిన పెన్షన్లలో జాప్యం చేస్తున్నది. ఈ నెలది వచ్చే మాసంలో, ఆ నెలది ముందు మాసంలో అందిస్తూ వస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు అత్తే నాలుగు వేల పింఛిన్ అత్తదని ఆశ వడితిమి. ఎలచ్చన్లు ఎప్పుడో అయిపోయినయ్. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండు గనీ ఇప్పటిదాకా పించిన్ పెంచకపాయే. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఇచ్చినట్లే గీళ్లు కూడా గదే రెండు వేలు ఇత్తుండ్రు. కేసీఆర్ సారు నెలనెల పింఛిన్లు ఇత్తే, గీళ్లు ఎనుకాముందు పంచుతుండ్రు.
– పోశవ్వ, వృద్ధురాలు, కోటగిరి
ముసలోల్లకు నాలుగు వేల రూపాల పింఛిన్ ఇత్తమని మాట ఇచ్చిండ్రు. మాట నిలబెట్టుకోవాల కదా? గిన్ని రోజులయిం ది. ఎలచ్చన్లు అయిపోయి ఏడాది అయిపాయే. పింఛిన్లు మాత్రం పెంచుతలేరు. గదే పాత రెండు వేలు ఇత్తుండ్రు. అదన్న టైంల ఇత్తుండ్రా అంటే లేదు. రేవంత్ సారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలే.
– కనకవ్వ, వృద్ధురాలు, కోటగిరి
కోటగిరి, ఏప్రిల్ 14: ఓట్లప్పుడు కాంగ్రెసోళ్లు అచ్చి రెండు వేల పించిన్ను నాలుగు వేలు జేత్తామని మాట ఇచ్చిండ్రు. అది జేస్తాం. గిది జేస్తామని మత్తు మాటలు చెప్పిండ్రు. అందరం నమ్మి ఓట్లేసి గెలిపిస్తిమి. యాడాదిన్నర అయిపాయె. ఇప్పటికీ గదే రెండు వేల పించిన్ ఇత్తుండ్రు. అన్ని ధరలు పెరిగినయ్. పించిన్ పైసలతోని నెల గడుపుడు కష్టమైతుంది. ఇచ్చే రెండు వేలన్న టైంల ఇత్తలేరు. మస్తు పరేషన్ అయితుంది. రేవంత్ సారు నాలుగు వేలు ఇస్తా అని చెప్పే. గిన్ని రోజులైంది కదా ఆ ముచ్చటనే లేదు. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు పించిన్లు పెంచితే మంచిగుంటుండే.
-సాలే గంగవ్వ, వృద్ధురాలి, కోటగిరి
ఎలచ్చన్లల్ల ముసలోల్లకు నాలుగు వేల పింఛిన్ ఇత్తా అన్నావ్ గదా? మల్ల ఏమైంది సారు. ఇప్పటిదాకా పింఛిన్లు పెంచింది లేదు. మునుపటి లెక్కనే నెలకు రెండు వేలు ఇత్తుండ్రు. అది కూడా పోయిన నెలది ఇప్పుడిత్తుండ్రు. ఈ నెలది ఇంకో నెలకిత్తిండ్రు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు గిట్ల లేకుండే. ఏ నెలకు ఆ నెల ఇచ్చేత్తుండ్రి. కూరగాయలు, కిరాణ సామాన్ల ధరలు బాగా పెరిగినాయ్. రెండు వేలకు ఏం అత్త్తలేదు. గిప్పుడైనా పించిన్లు పెంచితే మంచిగుంటది.
– నీలి వెంకటి, వృద్ధుడు, కోటగిరి