నిజామాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు భరోసా అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సారి మోసం చేసింది. ఏడాది కాలంగా రైతులను ఊరిస్తూ వచ్చిన సర్కార్ చివరకు ఉసూరుమనిపించింది. ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12వేలతోనే సరిపెట్టబోతుండడంతో రైతులు మండిపడుతున్నారు. ఓట్ల వేటలో కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలను ఇచ్చింది. రైతు డిక్లరేషన్‌లో రెండో తీర్మానంగా రైతుభరోసాను పెద్దఎత్తున ప్రచారం చేసింది.
ఎకరానికి రూ.15వేలు ప్రతి ఏటా ఇస్తామని మభ్యపెట్టి చివరికి ఇచ్చిన మాటను నెరవేర్చకపోవడంపై రైతుల్లో నిరాశ వ్యక్తమవుతున్నది. మరోవైపు జనవరి 26 నుంచి రైతుభరోసా అమలుచేయనుండడంపై రైతుల్లో అయోమయం ఏర్పడింది. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా, బ్యాంకు వివరాలు సేకరించకుండానే పెట్టుబడి సాయాన్ని ఎలా అందిస్తారో చెప్పాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి సాంకేతికపరమైన అంశాలపై స్పష్టత కరువైంది. కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో వానకాలానికి సంబంధించి 2లక్షల 82వేల 44 మందికి రూ.274.15కోట్లు మేర పెట్టుబడి సాయాన్ని సాగు కాలానికి ఠంఛనుగా అందించారు. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 71వేల మంది రైతులకు రూ.260కోట్లు వరకు రైతుబంధును జమ చేశారు. ఒక పంట సీజన్‌కు ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల మంది రైతులకు రూ.530 కోట్లు వరకు వెచ్చించారు.
మొన్నటి వరకూ గ్రామ సభల్లో రైతులంతా రైతుభరోసా కోసం దరఖాస్తు చేయాలంటూ ప్రభుత్వమే లీకులు ఇచ్చింది. తీరా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దరఖాస్తులు చేయడం భారీ ప్రక్రియ కావడంతో వరుసలో నిలబడడం మూలంగా రైతుల విలువైన సమయమంతా రైతువేదికల వద్దే గడిచి పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో వెనక్కి తగ్గిన సర్కారు ఒకడుగు వెనక్కి తగ్గి పంటలు సాగు చేసిన వారందరికీ రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించింది.
గతంలో రైతుబంధు పథకం 2023, వానకాలం వరకు నూటికి నూరు శాతం అమలైంది. గతేడాది యాసంగిలో స్వల్పంగానే అమలు చేశారు. ఈ ఏడాది కాలంలో చాలా మంది రైతులు తమ భూములను అమ్ముకున్నారు. కొత్త వారు భూములు కొన్నారు. ఈ భూ క్రయ, విక్రయాలతో యజమానులు మారిపోయారు. వీరి బ్యాంకు అకౌంట్ వివరాలు వ్యవసాయ శాఖ వద్ద లేవు. దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించకపోవడంతో కొత్తగా రైతుభరోసా పొందాలనుకునే రైతులకు నిరాశే ఎదురవుతున్నది. తమకు రైతుభరోసా ఎలా అమలు చేస్తారో? అని నిట్టూరుస్తున్నారు.
పట్టాదారు పాసు పుస్తకం నంబర్ ఆధారంగా రైతుల పేరిట చెక్కులు పంపిణీ చేస్తారా? లేదా అనే అనుమానాలున్నాయి. చెక్కు లు పంపిణీ చేయకపోతే బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా జమ చేయాల్సి వస్తే మాత్రం ఏడాది కాలంగా భూములు కొనుగోలు చేసిన వారికి మొండి చేయి ఏర్పడడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఈ అయోమయానికి ఫుల్స్టాప్ పెట్టాలని రైతులు కోరుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తమకేమీ మార్గదర్శకాలు రాలేవంటూ చేతులు ఎత్తేస్తున్నారు.
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇదీ మూడో పంట సీజన్. ఇప్పటికే రెండు పంట కాలాలు గడిచి పోయాయి. 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటుతోనే వానకాలం సీజన్ మొదలైంది. ఆ సమయంలోనూ కేసీఆర్ తీసుకు వచ్చిన రైతుబంధు పథకాన్ని అరకొరగా అమలు చేశారు. ఏడాది కాలంగా తాత్సారం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ నెల 4న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఏటా ఎకరానికి రూ.12వేలు సాయం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. పంటలు సాగు చేస్తున్న రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఇందులో అనేక తిరకాసులు ఉండడంతో రైతుల సాధక బాధకాలను తీర్చేందుకు వ్యవసాయ శాఖ ముందుకు రావడం లేదు.
2023 యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం దక్కని వారికి పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని రైతులంతా కోరుతున్నారు. 2024 వానకాలం సీజన్లో ఏ ఒక్క రైతుకు పెట్టుబడి సాయాన్ని జమ చేయలేదు. ఈ కాలానికి రైతులంతా ఎంతో కాలం సర్కారు సాయం కోసం ఎదురు చూసి అప్పులు చేసి పంటలు సాగు చేశారు. వీరి బాధలు తీరాలంటే గత సీజన్‌కు సంబంధించిన సాయాన్ని రైతులకు ఇవ్వాలంటూ డిమాండ్ వినిపిస్తున్నది.ఏడాది కాలంగా వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి సహా ముఖ్యమంత్రి వరకూ కల్లబొల్లి మాటలు చెప్పారు. ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అంటూ వాయిదాలు వేస్తూ ఏడాది గడిపారు. తీరా రూ.3వేలు కోత పెట్టి పెట్టుబడి సాయం చేస్తామనడం విడ్డూరంగా మారింది.
బాల్కొండ, జనవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప డిన నాటి నుంచి రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నది. ఎన్నికలప్పుడేమో రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టిండ్రు. ఏడాది నుంచి దాని ఊసే లేదు. ఇప్పుడు రూ. 15వేలు కాదని రూ.12 వేలు ఇస్తామని మోసం చేస్తున్నది.
– బాలరాజు, రైతు, బాల్కొండ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్పటికీ నుంచి రైతుల పరిస్థితి ఏమీ బాగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలను ఇచ్చింది. వాటిని ఇంతవరకూ నెరవేర్చడంలేదు. రైతుభరోసా రూ.12 వేలు కాకుండా ఇచ్చిన హామీ ప్రకారం రూ.15 వేలు ఇచ్చి ఆదుకోవాలి.
– ధర్మాయిగారి రాజేందర్‌రెడ్డి, రైతు, బాల్కొండ
రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారం చేపట్టి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చడం లేదు. అంతేగాక ఇస్తానన్న రూ.15 వేలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామనడం సరికాదు. మోసపూరిత మాటలతో రైతులను మభ్యపెడుతున్నది. మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఇస్తామన్న హామీని నెరవేర్చకుండా రైతులను నట్టేట ముంచింది.
-కన్న పోశెట్టి, రైతు, బాల్కొండ
రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోవడంలేదు. నట్టేట ముంచడానికి ప్రయత్నాలుచేస్తున్నది. రైతుభరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌కు గుణపాఠం తప్పదు.
-అశోక్, రైతు, కిసాన్‌నగర్ గ్రామం, బాల్కొండ