నిజామాబాద్ మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నది. పథకాల అమలులో పూటకో గడువు చెబు తూ రోజులు గడుపుతున్నది. రైతుభరోసా విషయంలో రేవంత్ సర్కారు మరోసారి మాట తప్పింది. ఏప్రిల్ నెలాఖరులోగా పెట్టుబడి సాయం పూర్తి చేస్తామంటూ నిజామాబాద్ వేదికగా ఏప్రిల్ 21న రైతు మహోత్సవం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనకు కూడా దిక్కు లేకుండా పోయింది. గతంలో చెప్పిన సమయానికి పెట్టుబడి సాయం అందించలేక పోయమని రైతులకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. నెలాఖరులోగా డబ్బులు వేస్తామని ప్రకటించారు. కానీ మే నెల ప్రారంభమైనా పైసలు పడలేదు. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పేది సొల్లు పురాణమే తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు.
రైతుభరోసా పథకం అమలు ఏమో కానీ వ్యవసాయ శాఖ అధికారులకు తలపోటుగా మారింది. జిల్లా వ్యవసాయాధికారి నుంచి మొదలు పెడితే వ్యవసాయ విస్తరణాధికారుల దాకా రైతులు అడిగే ప్రశ్నలకు జవాబివ్వలేక సతమతమవుతున్నారు. నాలుగు ఎకరాల్లోపు వారికి పెట్టుబడి సాయం వేశామని చెబుతున్నప్పటికీ, చాలా మందికి అది అందలేదు. అర ఎకరం, ఎకరం ఆపైన భూములున్న సన్న, చిన్నకారు రైతుల్లో భరోసా దక్కలేదు.
కొంత మందికి పట్టాదారు పాస్బుక్కులో ఉన్న విస్తీర్ణానికి భిన్నంగా తక్కువ నగదును జమ చేశారు. ఏఈవోలు, ఏవోలకు ప్రభుత్వం సీయూజీ ఫోన్ నంబర్లు అందించింది. గతంలో ఉన్న నెట్వర్క్ను మార్చడంతో నంబర్లు మారిపోవడంతో ఏఈవోలు, ఏవోలకు భారీ ఊరట దక్కింది. వారి ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో సామాన్య రైతులకు నేరుగా రైతు వేదికలకు పరుగులు తీస్తుండగా, అక్కడ ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. కొత్త నంబర్లు ఇవ్వడానికి అధికారులు సంశయిస్తున్నారు.
గతంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 10.48 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం వర్తించింది. ప్రస్తుతం గుట్టలు, పడావు భూములను తీసేస్తే సుమారుగా 10 లక్షల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి ఉంది. యాసంగిలో ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇస్తే రూ.600 కోట్లు రైతుల ఖాతాల్లో వేయాలి. కానీ ఇప్పటిదాకా కేవలం రూ.250 కోట్లు లోపే జమ చేసినట్లుగా తెలిసింది. మిగతా వారికి ఎప్పుడు వేస్తారో.. అసలు వేస్తారో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ హయాంలో పంట సీజన్ ప్రారంభానికి పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అయ్యేది. 11 విడుతలుగా అమలైన రైతుబంధు పథకంలో ఎప్పుడూ జాప్యం జరుగలేదు. కరోనా కష్ట కాలంలోనూ కేసీఆర్ రైతులకు సాయం నిలిపి వేయలేదు. కానీ కాంగ్రెస్ వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందర హామీ ఇచ్చింది. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి ఓట్లు వేయించుకున్నది. తీరా అధికారంలోకి వచ్చాక రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని రూ.12వేలకు తగ్గించింది.
అదయినా అందరికీ వేశారా అదీ లేదు. తొలి రెండు సీజన్లు రైతుభరోసాను ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం.. మొన్నటి యాసంగిలో రైతుభరోసా ఇస్తున్నామంటూ గప్పాలు కొట్టింది. కొంత మందికి మాత్రమే రూ.6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. సగానికంటే ఎక్కువ మంది అర్హులైన రైతులకు ఇప్పటికీ పెట్టుబడి సాయం అందలేదు. ఇదేందని అడిగితే సమాధానం ఇచ్చే దిక్కులేకుండా పోయింది. వ్యవసాయ శాఖ వద్ద అధికారిక సమాచారం లేదంటూ అధికారులు బుకాయిస్తున్నారు. ఎంత మందికి సాయం అందింది? ఇంకా ఎంత మందికి సాయం అందాల్సి ఉందని ప్రశ్నిస్తే వ్యవసాయాధికారులు సమాధానం ఇచ్చేందుకు జంకుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షలాది మందికి ఇప్పటికీ రైతుభరోసా అందలేదు. 4 ఎకరాల్లోపు రైతులకు డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతున్నది. అందులోనూ సగం మందికి మాత్రమే పెట్టుబడి సాయం నగదు జమ కాగా, చాలా మందికి అందలేదు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పే వారు లేరు. యాసంగి మొదలైన నాటి నుంచి నేటి వరకు నెలల తరబడి వేయి కళ్లతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాటలు విన్న రైతులంతా పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని ఆశగా ఎదురు చూశారు. వారందరికీ నిరాశే ఎదురైంది.