Rahul Gandhi | నిజామాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్‌గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ నగరంలో రాహుల్ బస్సుయాత్ర చివరి నిమిషంలో రద్దయింది. ప్రజల నుంచి ఊహించిన రీతిలో ఆదరణ కనిపించే పరిస్థితి లేకపోవడంతోనే అగ్రనేత టూర్‌ను కుదించినట్లు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆర్మూర్‌తో పాటు నిజామాబాద్ నగరంలోనూ పర్యటిస్తారని కాంగ్రెస్ కొద్దిరోజులుగా ఊదరగొట్టింది. చివరకు సమయం దగ్గరకు వచ్చేసరికి ‘చేతు’లెత్తేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో హస్తం పార్టీ తీరుపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభంజనంతో కుదేలైన కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు డీలా పడ్డారు.
ప్రజాదరణ లేకే..? అంతర్గత కుమ్ములాటలు.. సఖ్యత లేని నాయకత్వంతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు తాజాగా మరో పరాభవం ఎదురైంది. చివరి నిమిషంలో రాహుల్ పర్యటనను కుదించడం ద్వారా ప్రజల్లో చులకన అయింది. వాస్తవానికి రాహుల్‌గాంధీ బస్సుయాత్రతో నిజామాబాద్ జిల్లాలో ఏదో చేసేస్తామంటూ నెల రోజుల నుంచి ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గప్‌చుప్ అయ్యారు. జిల్లాలో రాహుల్ పర్యటనను కుదించి, ఒకే ఒక కార్యక్రమంతో పరిసమాప్తం చేస్తుండటం వెనుక వారికి గెలుపు అవకాశాలు లేకపోవడమే కారణమని ప్రచారం జరుగుతున్నది. ముఖ్య నాయకుడిని తీసుకొస్తున్నప్పటికీ, జనం రాకపోతే పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే పర్యటనను కుదించినట్లు తెలిసింది. అంతర్గతంగా కొట్లాటలతో బజారుపడి పరువు తీసుకునే బదులు మిన్నకుండటం ఉత్తమమనే అభిప్రాయంతోనే ఇదంతా జరిగిందన్న ని ప్రజలు అనుకుంటున్నారు.
అభ్యర్థుల ఖరారుతో పాటు ఇప్పటికే ఎన్నికల ప్రచారంతో బీఆర్ఎస్ దూసుకెళ్తుంటే, కాంగ్రెస్ పార్టీ కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించని లేని దుస్థితిలో ఉన్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ అభ్యర్థులనే ఖరారు చేయలేదు. బరిలో నిలవాల్సిన వ్యక్తులెవరో ఇప్పటి వరకు తేల్చలేదు కానీ ప్రచార పర్వానికి అగ్రనేతలను బరిలోకి దింపడంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కేవలం 3 సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించి చేతులు దులుపుకుంది. మిగిలిన చోట్ల అభ్యర్థులే కరువయ్యారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. టికెట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన ఆశావాహులు మినహా అదే పార్టీలో పని చేస్తూ టికెట్ కోసం డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళా అభ్యర్థుల ప్రకటనలో తాత్సారంతో పార్టీ క్యాడర్ పక్క చూపులు చూస్తున్నది. భారీగా ప్రజాదరణతో ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్లోకి చేరేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల కాంగ్రెస్‌ను వీడి కారెక్కారు. రానున్న రోజుల్లో చేరికలు మరింత ఊపందుకోనున్నాయి.
అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచారంలో దూసుకు పోతున్నది. నాయకులంతా ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రచారంచేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాన్ని ఒకసారి చుట్టేశారు. ఇక ప్రచార జోరును పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ జనం ఇబ్బందులను, సమస్యలను ఆలకిస్తూ వచ్చే ప్రభుత్వంలో చేయాల్సిన మరింత అభివృద్ధిని, చేపట్టాల్సిన నూతన కార్యక్రమాలపై ప్రజలతో మమేకమవుతున్నారు. భారీ మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతున్న వేళా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను సైతం సరిగా ప్రకటించుకోలేక చతికిల పడింది.