వేల్పూర్, మార్చి 31: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి నెలకొనడంతో బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో సోమవారం వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరగా..వారికి వేముల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు ఉన్నప్పుడే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తున్నదని, ఎన్నికలు ముగిశాక వేయడంలేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నాట్లు వేస్తున్నప్పుడు రైతు బంధు ఇస్తే, రేవంత్‌రెడ్డి ఓట్లు ఉన్నప్పుడే రైతుభరోసా ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మోసపూరిత, కక్షపూరిత పరిపాలన కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ ఓట్ల కోసమే ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీల ద్వారా అధికారంలోకి వచ్చిందన్నారు.
వంద రోజుల్లోనే హామీలను అమలుచేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 500 రోజులు గడిచినా ఇప్పటివరకూ ఒక్క హామీని సక్రమంగా అమలుచేయడంలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసహనానికి లోనై నాయకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలదీస్తున్నామని, తాము అధికారంలో లేకున్నా ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నైజం రైతులకు అర్థమైంది..
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి, ఇప్పుడు ఎకరానికి రూ.12 వేలు వేశారని తెలిపారు. కేసీఆర్ వెంట ఉన్న రైతులను మోసపూరిత హామీలు ఇచ్చి తమ వైపునకు తిప్పుకున్నదని కాంగ్రెస్ నైజం రైతులకు తొందరగా అర్థమైందన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500, రూ. 4వేలు పింఛన్, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడని ప్రశ్నించారు.
50వేల ఉద్యోగాలు అన్నారని, అవి కూడా లేవన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కేవలం 11వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్లో చేరింది వీరే..
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పల్లికొండ నర్సయ్య, భీమ్‌గల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దరావత్ లింగం, మోర్తాడ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తక్కురూ రంజిత్, భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తండా తాజా మాజీ సర్పంచ్ లౌడియ రమేశ్‌నాయక్‌తోపాటు వారి అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పల్లికొండ నర్సయ్య తన పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
పోలీసులు చట్టాలకు లోబడి పనిచేయాలి..
సోషల్ మీడియాలో హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని వేముల ఆరోపించారు.పోలీసులు చట్టాలకు లోబడి పని చేయాలని, అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీవి కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా అతి ఉత్సాహంగా తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే కాలం ఒకలా ఉండదన్నారు. అధికారం మారినప్పుడు ఆ పోలీస్ అధికారి ఎవరైనా..ఎక్కడ ఉన్నా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు.అలాంటి అధికారుల పేర్లను నోట్ చేసుకుంటున్నామని, ఉద్యోగ విరమణ పొందిన సరే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్లో చేరి తమకు మరింత బలాన్ని ఇచ్చిన వారికి వేముల కృతజ్ఞతలు తెలిపారు.
కేసులకు భయపడేదిలేదు..
ప్రజల అండ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని, ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తూనే ఉంటామని వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపి భయపెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ ఉద్యంలో అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చామని వేముల గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబులాంటి పెద్ద నాయకులను ఎదురించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నదన్నారు. వారి ముందు రేవంత్‌రెడ్డి ఎంత అని, ఆయన ఊకదంపుడు బెదిరింపులకు ఎవరూ భయపడబోరని అన్నారు.