మోర్తాడ్, జూన్ 6: ధరల పెంపుతో ప్రధాని మోదీ ప్రజలను లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం పేరిట కేంద్రంలోని బీజేపీ.. సామాన్యులు, రైతుల జేబులు గుల్లచేస్తున్నదని ధ్వజమెత్తారు. గతంలో రూ.1200 ఉన్న డీఏపీ బస్తా ధర రూ.2150కి, రూ.1400 ఉన్న జీలుగ ధర రూ.2400కు పెంచి రైతులపై అదనపు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉన్నదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ముందుకు పెట్టి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్షఅని అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వనమోదు, సర్‌పై అవగాహన కోసం మోర్తాడ్ శివారులోని లలితాగార్డెన్స్లో శనివారం నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో రైతులు కేవలం ఒక ఫోన్‌కాల్‌తో యూరియా వారి పొలాల్లోకి చేరేదని, నేడు కాంగ్రెస్ తెచ్చిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. యాప్ విధానం వల్ల వారాల తరబడి యూరియా కోసం రైతులు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కేసీఆర్ పాలనలో పెట్టుబడి సాయం అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేశారన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు, కోదండరెడ్డి వంటి వారు మాట్లాడుతూ.. వ్యవసాయానికి కేవలం మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యాతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం విత్తనాల సీజన్ ప్రారంభమైనందున రైతులకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి విద్యుత్‌శాఖను విభజించి రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ సరఫరాను దెబ్బతీయాలని చూస్తున్నాయని వేముల మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కమర్షియల్, ఇండస్ట్రియల్ రంగాల ఆదాయంతో రైతులకు ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు. ప్రస్తుతం లాభాదాయక విభాగాలను ప్రైవేటుకు అప్పగించి, వ్యవసాయ రంగాన్ని మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉంచే కుట్ర జరుగుతున్నదని, దీని వల్ల భవిష్యత్తులో రైతులకు విద్యుత్ అందకుండా పోయే ప్రమాదం పొంచి ఉన్నదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, కేంద్రప్రభుత్వ విధానాలను సాకుగా చూపడం సరైంది కాదని, ఇదే కేంద్ర ప్రభుత్వం ఉండగా కేసీఆర్ పాలనలో ప్రతిగింజను కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా దగా అని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్క బాల్కొం డ నియోజకవర్గంలోనే 30 వేల మందికి రుణమాఫీ కాలేదని, అర్హులైన వారందరికీ రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన రూ.4లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసి, ఆ నిధులతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌లు, రూ.75 వేల కోట్ల రైతుబంధు, మిషన్‌భగీరథ ద్వా రా ఇంటింటికీ నీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వెయ్యి గురుకుల పాఠశాలలను నిర్మించి తెలంగాణను ఆదర్శంగా నిలిపారని, కేసీఆర్ అప్పు చేసి సంపదను సృష్టించారని తెలిపారు . కేసీఆర్ అప్పులు చేశారని విమర్శిస్తున్న కాంగ్రెస్ రెండున్నరేండ్లలోనే ఏకంగా రూ.4లక్షల కోట్లు అప్పు చేసిందని, మరీ ఆ అప్పుతో ఏం సాధించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తప్పుడు పద్ధతుల ద్వారా బీఆర్ఎస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసే ప్రమాదం ఉందని వేముల ఆందోళన వ్యక్తం చేశారు. మన ఓట్లను కాపాడుకోవడంతో పాటు కొత్త ఓట్లు చేర్పించడం, ఎక్కడా డూప్లికేట్ ఓట్లు నమోదు కాకుండా బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరు వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ స్పూర్తితో ప్రతి కార్యకర్త ఒక సైనికుడు కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి దావ వసంత, ఉద్యమకారుడు రాజారాంయాదవ్ పాల్గొన్నారు.

సభ్యత్వనమోదు, సర్‌పై అవగాహన సదస్సుకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. కుర్చీలు సరిపోకపోవడంతో కార్యకర్తలు, నాయకులు కార్యక్రమం ముగిసే వరకూ కింద కూర్చుని తిలకించారు. రేవంత్‌రెడ్డి అవలంభిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై ఆగ్రహించిన ఒక రైతు కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో అందరూ చేతులెత్తి మద్దతు తెలిపారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా అని సినిమా స్టార్ పవన్‌కల్యాణ్ మాట్లాడుతుండు. నేనంటున్న బరాబర్ తెలంగాణ మా అయ్య, అవ్వ జాగీరే. తెలంగాణకు రా.. పో.. సినిమాలు చేసుకో, నాలు గో పెండ్లి చేసుకున్నా మేము వద్దనం. కానీ తెలంగాణ గురించి మాత్రం నోరు జారొద్దని చెప్తున్నా.

కేసీఆర్, కేటీఆర్ లాంటి సూర్యచంద్రులు ఉన్నంతకాలం బీఆర్ఎస్కు తిరుగులేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక బుడ్డర్ఖాన్. ఏబీవీపీ, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో తిరిగిన అంటడు, వడ్లు కొనరా అంటే కేసీఆర్ గురించి, 420 హామీలు అమలు చేయరా అని అగిడితే కేసీఆర్, కేటీఆర్‌ల గురించే మాట్లాడుతడు. కాంగ్రెస్, బీజేపీలది రాష్ట్రంలో ఫెవికాల్ బంధం. అబద్ధాలు మాట్లాడడం తప్ప అభివృద్ధి పనులు మాత్రం చేసిందేమిలేదు.
– జీవన్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే
అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లని దగా చేసింది కాంగ్రెస్. ఎస్సీల్లో మూడు కార్పొరేషన్లు అని, ఏడాదికి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750కోట్లు ఇస్తామని, ఎస్టీలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏడాదికి రూ.500కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.

పోడుభూములకు పట్టాలిస్తమన్నరు ఇయ్యలే. జాగ లేనోళ్లకు జాగ ఇచ్చి రూ.6 లక్షలు ఇస్తమన్నరు ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలే. దళితబంధు తీసుకొచ్చి దళితులను ఆదుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తే, వీళ్లేమో ఉన్న దళితబంధును బందు జేసిండ్రు. చదువుకున్న వారికి వారి చదువును బట్టి ఆర్ధికసాయం అన్నరు అదిలేదు. అడుగడుగునా ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కాంగ్రెస్ గురించి ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ ప్రచారం చేస్తాం.
– హన్మంత్ షిండే, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
విద్యార్థుల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. అందుకోసం బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి.

సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలి. ఎన్నికల సమయంలో కేవలం అధికారంలోకి రావడం కోసమే అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేలా కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ మోసాలను ఊరూరా ఎండగట్టాలి.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తూ పార్టీని బలోపేతం చేయాలి.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీలో పని చేయడం గర్వంగా ఉన్నది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దోచుకో, దాచుకో అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. రైతులను ఆదుకునే సోయిలేదు, హామీలు అమలు చేసే ఊసే లేదు.
– దావ వసంత, బాల్కొండ నియోజకవర్గ సభ్యత్వనమోదు ఇన్చార్జి
మోర్తాడ్, జూన్ 6: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ చేసిన మోసాలను, అలాగే, పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలి.

కేసీఆర్ పాలనలో దేశంలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలు ఎంపికైతే, ఒక్క తెలంగాణ నుంచే 18 ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయి. పార్టీ సభ్యత్వనమోదులో బాల్కొండను ముందంజలో ఉంచడంతో పాటు పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఉండేలా చూసుకోవాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.
– వీజీ గౌడ్, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి
రాష్ట్రంలో 420 కాంగ్రెస్, బుడ్డర్ఖాన్ రేవంత్ సినిమా నడుస్తున్నది. హామీలు ఇస్తే అమలు చేయాలే.. చేయకపోతే హామీలు ఇవ్వొద్దు.మా ట్లాడితే కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ బుడ్డర్‌ఖాన్‌లా వ్యవహరిస్తుండు. రాష్ట్రంలో మోసగాళ్ల రాజ్యం నడుస్తున్నది.

కాంగ్రెస్ హామీల ఎగవేతపై గ్రామాల్లో ప్రచారం చేయాలి. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో నంబర్‌వన్‌గా ఉంచారు. అదే దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం నంబర్‌వన్‌గా మారుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
– బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే