ఖలీల్‌వాడి, నవంబర్ 28 : బాండ్‌పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ రాసిచ్చి, మోసం చేస్తున్నారని అన్నారు. మొసలి కన్నీళ్లకు బలైతే రానున్న ఐదేండ్లు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవని అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క తదితర నాయకులు కూడా బాండ్ పేపర్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. ప్రజల్లో కాంగ్రెస్ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందని, 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు.. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాయడం విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని తెలిపారు. కర్ణాటకలో మహిళలకు రూ.2వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర హామీలను ఇంకా అమలుచేయనేలేదన్నారు. కర్ణాటకలో 2 లక్షల 60 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రతి సభలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారని, వంద రోజులు పూర్తయినా వాటి ఊసే లేదని అన్నారు. దీనిని యువత గమనించాలని కోరారు. కర్ణాటకలో బియ్యం లేకపోవడంతో పంపిణీ కూడా చేయడం లేదని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి, బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని వివరించారు.
బీజేపీ పాలిస్తున్న హర్యానా నిరుద్యోగంలో నంబర్‌వన్ స్థానంలో ఉందని, కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మొదట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వాళ్ళు వాళ్లే కొట్టుకొని బీజేపీ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని తెలిపారు. తెలంగాణలో 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశామని, లక్షా 60 వేల మందిని భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేట్‌లో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు.
తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇతర రాష్ర్టాల్లో ఇస్తే ఒక్క ఓటు కూడా అడుగబోమని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతతో బీజేపీ నాయకులు మీటింగ్‌లు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డల కోసమే స్వరాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్ర బిడ్డల కోసమే కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.