ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఉమ్మడి జి ల్లాలో లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు చేయూతతో సొంతింటి కల తీరుతుందని ముచ్చటపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభు త్వం విధించిన నిబంధనలు చూసి నోరెళ్ల బెడుతున్నారు. ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగులకు మించితే బిల్లులు రావని సర్కారు తేల్చి చెబుతుండడంతో ఇంటి నిర్మాణంపై అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ఇంటి నిర్మాణ పను లు ప్రారంభించిన వారు బిల్లులు రాక సతమతమవుతున్నారు.
సొంత స్థలం ఉన్న వారు ప్రభుత్వమిచ్చే ఆర్థిక సాయంతోపాటు కొంత అదనంగా ఖర్చు చేసి ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావించారు. లబ్ధిదారుల ఆకాంక్షలకు విరుద్ధంగా కఠిన నిబంధనలు విధించింది. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు కడితే బిల్లులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మందికి బిల్లులు రాకపోవడంతో మిగిలిన లబ్ధిదారుల్లో భయం పట్టుకుంది. దీంతో ఇల్లు కట్టాలా వద్దా? అన్న సంశయంలో పడిపోయారు.
మరోవైపు, గోడలు నిర్మించి కిటికీలు బిగిస్తే రెండో దశ కింద రూ.1.25 లక్షలు మంజూరవుతాయి. జిల్లాలో రెండో దశను 50 మంది లబ్ధిదారులు చేరుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లు మంజూరు ప్రహసనంగా మారిం ది. జీపీ కార్యదర్శి ఫీల్డ్ విజిట్ చేసి ఫొటో వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. గృహ నిర్మాణ శాఖ ఏఈ క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలించి ఆమోదిస్తాడు. కలెక్టర్ లాగిన్ అయ్యాక గృహ నిర్మాణ శాఖకు పంపడంతో బిల్లులు మంజూరు అవుతాయి.
నిరుపేదలతో చెడుగుడు ఆడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పేదలకు గూడు కల్పించే పథకంలో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కేంద్ర నిధులపై ఆధారపడిన రాష్ట్రం సైతం వెనుకాముందు ఆలోచించకుండానే ఇండ్ల నిర్మాణాల పేరిట ప్రజలను ప్రోత్సహించింది. పాత ఇండ్లను కూల్చి వేసి మరీ కట్టుకోవాలంటూ వెంటపడింది. తీరా ఇప్పుడు నిర్దిష్ట ప్రమా ణాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోలేదని నిజామాబాద్ జిల్లాలో 80 మందికి బిల్లులు ఆగిపోవడం చర్చనీయాంశమైంది.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. సొంత జాగాలో ఇళ్లు కట్టుకున్నప్పటికీ సాయం చేస్తామంటూ గొప్పలు చెప్పింది. ఇది నమ్మిన ప్రజలు కాంగ్రెస్ను గద్దెనెక్కించారు. అధికారంలోకి వచ్చాక హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం వస్తుందనుకుని ఆశ పడిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. పూటకోమారు గృహ నిర్మాణ శాఖ అధికారులు వచ్చి నిబంధనల మేరకే ఇళ్లు కట్టాలంటూ చెబుతుండడంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు.
నిబంధనల మేరకు కాకుండా ఏ కాస్త అటుఇటు కట్టినా బిల్లులు రావని చెబుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో నిబంధనల ఉల్లంఘన పేరుతో 80 మందికి పైగా బిల్లులు నిలిచి పోయాయి. నిజామాబాద్ జిల్లాలో 2,807 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇందులో సగం కూడా ముగ్గు పోయలేదు. 950 మంది వరకు మాత్రమే పనులు ప్రారంభించగా, ఇందులో 200 నిర్మాణాలు పునాది దశకు చేరాయి. 150 మంది వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేయగా, 130 మందికి రూ.లక్ష చొప్పున మొదటి విడుత డబ్బులు వచ్చాయి. మిగిలిన వారికి టెక్నికల్ కారణాలు చూపి బిల్లులు ఆపేశారు.
నిరుపేదలకు మాత్రమే ఇల్లు కట్టించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలను ప్రభుత్వం కఠినంగా రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.50 లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు మాత్రమే ఇండ్లు నిర్మించుకోవాలి. రాష్ట్ర ప్రభు త్వం ఈ నిబంధనను పట్టించుకోకుండా ఎంత వైశాల్యంలోనైనా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవచ్చని తొలుత చెప్పింది.
అయితే, పనులు మొదలయ్యాక కేంద్ర సాయం కోసం అర్రులు చాచడంతో అసలు విషయం తెలిసింది. ఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగుల కన్నా అధికంగా ఉండటంతో వాటికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏమి చేయాలో అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వం తలలు పట్టుకుంటున్నది. అదనపు వైశాల్యంలో నిర్మించుకున్న ఇండ్లను రద్దు చేయాలా? లేక కేంద్రంతో సంబంధం లేకుండా రూ.5 లక్షలు తమ ఖాజానా నుంచే ఇవ్వాలా? అని తేల్చుకోలేని కాంగ్రెస్ సర్కారు.. లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నది.